హిమాదాస్‌కు ప్రధాని, రాష్ట్రపతి అభినందనలు

న్యూఢిల్లీ, జులై13(జ‌నం సాక్షి) : అండర్‌ -20 ప్రపంచ అథ్లెట్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన హిమాదాస్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. అండర్‌ – 20 ప్రపంచ ఛాంపియన్స్‌లో హిమాదాస్‌ స్వర్ణం సాధించింది. హిమాదాస్‌ స్వర్ణం సాధించడం భారత్‌కు గర్వకారణం. ఈ విజయం యువ అథ్లెట్లకు స్పూర్తిగా నిలుస్తుందని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత స్టార్‌ స్పంటర్‌ హిమదాస్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది. అండర్‌-20 విభాగంలో ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న ఐఏఏఎఫ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో గురువారం జరిగిన 400విూటర్ల ఫైనల్లో 51.46 నిమిషాల్లో గమ్యం చేరి తొలిస్థానంతో బంగారు పతకం అందుకుంది. తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సరసన నిలిచింది. 2016లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కొత్త ప్రపంచ రికార్డుతో నీరజ్‌చోప్రా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం అందించిన విషయం తెలిసిందే. కాగా, మహిళల విభాగంలో ప్రపంచకప్‌ డిస్కస్‌ త్రోలో 2014లో నవ్‌నీత్‌ కౌర్‌(కాంస్యం), 2002 ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ డిస్కస్‌త్రోలో సీమా పునియా(కాంస్యం) సాధించారు. తాజాగా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన యువ హిమదాస్‌ స్వర్ణంతో మెరిసి తొలి స్వర్ణం సాధించిన భారతీయురాలిగా ఘనత సాధించింది.