హుజరాబాద్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలు
మహిళా సమాఖ్య భవనానికి మంత్రి హరీష్ శంకుస్థాపన
హుజూరాబాద్,అగస్టు12(జనం సాక్షి): హుజరాబాద్‌లోనే మకాం వేసిన మంత్రి హరీష్ రావు ఇక్కడ వివిధ కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి హరీశ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హుజూరాబాద్ టౌన్‌లో పట్టణ మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో మంత్రి
హరీశ్‌రావుకు మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్‌లో స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్‌తో కలిసి హాజరయ్యారు. మంత్రి హరీశ్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు మహిళా సంఘం భవన నిర్మాణానికి మత్రులు హరీశ్ రావు, గంగుల భూమి పూజ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.