హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస హంగామా


గెల్లు అభ్యర్థిత్వంపై సర్వత్రా హర్షం
బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేసిన కార్యకర్తలు
రంగంలోకి దిగిన ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌ రావు
నియోజకవర్గంలో బైక్‌ ర్యాలీ నిర్వహించిన మంత్రులు
హుజూరాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ హంగామామొదలయ్యింది.
ఇంతవరకు ఉప ఎన్నిక కోసం వివిధ కార్యక్రమాలు కొనసాగినా, ఇప్పుడు అధికారికంగా పార్టీ అభ్యర్థి ప్రకటనతో కార్యకర్తలు దూమ్‌ ధామ్‌ నిర్వహించారు. పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును ప్రకటించడంతో.. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆయన మద్దతుదారులు సంబురాలు చేసుకున్నారు. గెల్లు శ్రీనివాస్‌ పేరును సీఎం కేసీఆర్‌ ప్రకటించిన మరుక్షణమే పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటూ.. టపాసులు కాల్చారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. గెల్లు
అభ్యర్థితత్వంపై యువతలో ఉత్సాహం వెలువెత్తితింది. శ్రీనివాస్‌ యాదవ్‌ను గెలిపించుకుంటామని నియోజకవర్గంలోని కార్యకర్తలు ప్రకటించారు. హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ అభ్యర్థితత్వాన్ని ఖరారు చేయడంతో సీఎం కేసీఆర్‌కు గొల్ల, కురుమ సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాయి. ఇదిలావుంటే హుజూరాబాద్‌ మండలంలోని కేసీ క్యాంప్‌ వద్ద రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావుకు ఆ నియోజకవర్గ వాసులు ఘన స్వాగతం పలికారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు మంత్రులు హరీష్‌ రావు, గంగుల కమలాకర్‌తో కలిసి కేసీ క్యాంప్‌ నుండి అంబేద్కర్‌ చౌరస్తా వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. జై తెలంగాణ నినాదాలతో హుజూరాబాద్‌ దద్దరిల్లింది. మొత్తంగా హుజూరాబాద్‌ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌రావు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరీష్‌రావుకు అప్పగించిన తర్వాత ఆయన తొలిసారిగా పర్యటనకు వచ్చారు. ఇంతకాలం నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేతలతోపాటు వివిధ పార్టీల నేతలు, ఇతర రంగాల ప్రముఖులు, ప్రజలపై ప్రభావం చూపగలిగే వారిని సిద్దిపేటకే పిలిపించుకొని చర్చించారు. ఆయన ఇప్పుడు నేరుగా నియోజకవర్గంలో అడుగు పెట్టారు. ఈనెల 16న లక్ష మందితో నిర్వహించనున్న దళితబంధు సభకు సీఎం కేసీఆర్‌ హాజరుకానున్న నేపథ్యంలో హరీష్‌రావు హుజురాబాద్‌లో పర్యటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. పార్టీ నేతల్లో, శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి ఎక్కడైనా చిన్నచిన్న లోపాలు ఉంటే వాటిని సవరించి అందరిని సమన్వయ పరిచేందుకు ఆయన నేరుగా రంగంలోకి దిగారు. ఈటెలను ఢీకొనడంతో పాటు నియోజకవర్గంలో పట్టుబిగించడంపైనే దృష్టి సారించారు. పార్టీశ్రేణులను జారి పోకుండా చూడడంతోపాటు ఇతర పార్టీల నేతల మద్దతు కూడగట్టి పలువురిని పార్టీలోకి ఆహ్వానించడం లాంటి కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కొద్దిరోజులుగా తన స్వరాన్ని పెంచి విమర్శలను తిప్పికొడుతూ వస్తున్న హరీష్‌రావు ఇప్పుడు నేరుగా హుజూరాబాద్‌లో కాలుమోపారు. దీనితో హుజూరాబాద్‌ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అటు మంత్రి గంగుల, ఇటు కొప్పుల ఈశ్వర్‌ నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా అడపాదడపా ఇతరశాఖల మంత్రులు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని నియోజకవర్గానికి వస్తున్నారు. ఇప్పుడునియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు తన పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు ఉన్న పరిస్థితులు చేపట్టాల్సిన చర్యలు అలాగే వివిధ మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండిరగ్‌లో ఉన్న పనులు, చేపట్టాల్సిన పనుల విషయాలను ఆరా తీసి అవసరమైన ఆదేశాలు జారీ చేస్తారని చెబుతున్నారు.