హుజూరాబాద్‌లో పథకాల వెల్లువ

ఇంటింటికీ ఓ పథకం అందేలా చర్యలు
ప్రతి ఓటరూ లబ్దిదారుడయ్యేలా ప్రణాళికలు
మంత్రులు, ఎమ్మెల్యేల మకాంతో వేడెక్కిన రాజకీయం
హుజూరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): హుజూరాబాద్‌లో విజయం సాధించడం ద్వారా ఈటల రాజేందర్‌ను శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు పక్కా ప్లాన్‌తో అనేక పథకాలను ఆగమేఘాల విూద అమలు చేస్తున్నారు. ఇంటికో పథకం అన్నట్లుగా గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టేలా పథకాలు వెల్తువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడే మకాం వేసి వీటిని అమలు చేస్తున్నారు. అరచేతిలో స్వర్గం చూపుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సుమారు 30 లక్షల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించి ఇప్పటికే పలుచోట్ల శంకుస్థాపనలు చేశారు. హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీలకు కూడా 66.82 కోట్ల రూపాయలు విడుదల చేసి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంచుతూ, కొత్త రేషన్‌కార్డులను, పింఛన్లను మంజూరు చేస్తూ ప్రజల్లో పట్టుబిగిస్తున్నారు. ఇక్కడ ఈటల రాజేందర్‌ గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి రాష్ట్రంలో బీజేపీ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుందని, ఆ పార్టీలోకి వివిధ పార్టీల
నుంచి వలసలు కూడా పెరిగి బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నది. ఆయనను ఓడిరచడం ద్వారా అటు ఈటలను, ఇటు బీజేపీని రాష్ట్రంలో రాజకీయాలకు దూరం చేయవచ్చని అనుకుంటున్నది. అందుకే హుజూరాబాద్‌ గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను మండలాలవారీగా ఇన్‌చార్జిలుగా నియమించి ఈటల రాజేందర్‌ రాజీనామా చేసిన నాటి నుంచే క్షేత్రస్థాయికి పంపించింది. వారంతా రెండు నెలలుగా పార్టీ శ్రేణులను, నేతలను సమన్వయపరుస్తూ ఈటల రాజేందర్‌ వెంట ఎవరు వెళ్లకుండా చూస్తూ ఆయనవైపు వెళ్లిన వారిని తిరిగి పార్టీవైపు రప్పించుకుంటూ పార్టీలో చీలికరాకుండా చూసుకుంటున్నారు. ఇతర పార్టీల నేతలను కూడా చేర్చుకుంటున్నారు. దళితబంధు పథకాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి ఈ నెల 16న హుజూరాబాద్‌లో 5 వేల మందికి 500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం లక్ష మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు రెండు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటించి ముఖ్యమంత్రి పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో పర్యటించి పార్టీ నాయకులు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. దీంతో అతి త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని అందుకే నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా రంగంలోకి దిగుతున్నారని భావించారు. దీనికితోడు ఇంతకాలం తేల్చకుండా వచ్చిన అభ్యర్థిత్వం వ్యవహారానికి కూడా తెరదించారు. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలోకి దించారు. కేంద్ర ఎన్నికల సంఘం వివిధ రాజకీయ పక్షాలకు ప్రస్తుతం ఎన్నికల నిర్వహణపై సంసిద్ధతను తెలియజేయాలని కోరుతూ లేఖలు రాయడంతో ఎన్నికలు వాయిదా పడతాయనే చర్చకు తావిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ హుజూరాబాద్‌లో ఎంత ఆలస్యంగా ఎన్నిక జరిగితే ఈటల రాజేందర్‌ అంతగా బలహీన పడతాడని, ఆ మేరకు తమ పార్టీ లబ్ది పొందుతుందని భావిస్తున్నది. ఈ కారణాలతో టీఆర్‌ఎస్‌ కచ్చితంగా ఎన్నికల వాయిదాను కోరుతూ ప్రస్తుతం కొవిడ్‌ విజృంభిస్తున్న దశలో ఎన్నికల నిర్వహణ సమంజసం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందని అనుకుంటున్నారు. ఈటల రాజేందర్‌ అసైన్డ్‌ భూములు కబ్జా చేశారని కొన్ని ఛానళ్లలో కథనాలు ప్రసారం కావడం, ఆ వెనువెంటనే ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడం, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం 48 గంటల్లో చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాల దృష్ట్యా ఈటల రాజేందర్‌ గత జూన్‌ 12న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించి హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అయినట్లు తెలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిరది. తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడం, బీజేపీ అభ్యర్థిగా ఆయన హుజూరాబాద్‌ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతోపాటు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సవాల్‌ విసురుతూ వస్తున్నారు.