హుజూరాబాద్‌, బద్వేలు ఉప ఎన్నికల నగారా

అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల
నామినేషన్‌ దాఖలుకు అక్టోబర్‌ 8 చివరి తేదీ
అక్టోబర్‌ 11న నామినేషన్ల పరిశీలన
అక్టోబర్‌ 30న ఎన్నిక..నవంబర్‌ 2న కౌంటింగ్‌
న్యూఢల్లీి,సెప్టెంబర్‌28 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. వచ్చే నెల 30 హుజూరాబాద్‌, బద్వేలు ఉప ఎన్నిక జరుగనుంది. అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల కానుంది.
నామినేషన్‌ దాఖలుకు అక్టోబర్‌ 8 చివరి తేదీగా నిర్ణయించింది. అక్టోబర్‌ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అక్టోబర్‌ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అక్టోబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు… ఆ వెంటనే ఫలితాలు వెలువడనున్నాయి. హుజూరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు నియోజకవర్గానికి కూడా అక్టోబర్‌ 30న ఉప ఎన్నిక జరగనుంది. ఇక దేశ వ్యాప్తంగా మరో 28 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు కూడా ఇదే షెడ్యూల్‌ వర్తించనుంది. హుజూరాబాద్‌లో ఇప్పటికే ఉప ఎన్నికల వేడి రాజుకుంది. అధికార టిఆర్‌ఎస్‌, విపక్ష బిజెపిలుపోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి కొండా సురేఖ బరిలోకి దిగుతారని అనుకుంటున్నారు. అధికారికంగా ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇకపోతే హుజూరాబాద్‌ ఉప
ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న విషయం విదితమే. ఈటల రాజేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి జూన్‌ 12న రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈటెలను మంత్రివర్గం నుంచి తప్పించడం, ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. కొడుకు కేటీఆర్‌ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్‌ కుట్ర పన్ని తనను పక్కకు తోశారని మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలను వదిలిపోతానని, కేసీఆర్‌, హరీశ్‌రావు తమ పదవులకు రాజీనామా చేస్తారా అంటూ సవాల్‌ విసిరారు. ఇకపోతే హుఊరాబాద్‌ వేదికగా దళితబంధుకు సిఎం కెసిఆర్‌ శ్రీకారం చుట్టారు. ఇప్పుడక్కడ ఈ పథకం కింది ఒక్కో కుటుంబానికి పదిలక్షలు అందుతున్నాయి. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.