హెచ్‌సీయూ భూములను అమ్మొద్దు : కేటీఆర్
` ఆ స్థలాన్ని ఎవరైనా కొంటే అధికారంలోకి వచ్చాక మళ్లీ రికవరీ చేస్తాం
` బిఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అనుమతి ఎందుకివ్వరు?
` పార్టీ పరంగా మాకు అత్యంత కీలకమైన సభ ఇది
` ప్రభుత్వం తీరుపై మండిపడ్డ బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
కరీంనగర్ బ్యూరో, (జనంసాక్షి) : హెచ్సీయు పరిధిలోని కంచె గచ్చిబౌలి భూములను సీఎం రేవంత్ రెడ్డి పీక్ అనే సంస్థకు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారని, అందుకోసం రూ. 170 కోట్లు లంచం ఇచ్చారని ఆరోపించారు. ఈ తెరవెనుక తతంగం నడిపింది బిజెపి ఎంపీ అని దేశంలోనే ఇది అతిపెద్ద ఆర్థికమోసమన్నారు.కరీంనగర్‌లోని కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో రజతోత్సవ సభ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా కెటిఆర్ హాజరై విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి లోపాయికారీ ఒప్పందంతో తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. ఈ భూములను ఎవరు కొనుగోలు చేసినా మూడేళ్ల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సెంటు భూమిని సైతం వదలబోమన్నారు. ఈ యేడాది బిఆర్‌ఎస్కు అత్యంత కీలకమని మే నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామన్నారు. ఇదంతా ఆన్లైన్ యాప్లోనే జరుగుతుందని తమ పార్టీకి 60 లక్షల సభ్యత్వం ఉందన్నారు. నెల రోజుల క్రితమే బిఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అనుమతి కోరితే ఇప్పటి వరకు ఇవ్వలేదని, హైకోర్టును సంప్రదిస్తే 21న గడువు ఇవ్వడం జరిగిందన్నారు. తాము రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధమేం ప్రకటించడం లేదని, కేవలం 25 ఏళ్లు పూర్తయిన సందర్బంగా రజతోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఆర్టీసీకి 300 బస్సులు కావాలని రూ.10 కోట్లు చెల్లించామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కాళేశ్వరంలో 370 పిల్లర్లతో ఒక పిల్లర్ పర్రె పెడితే కాళేశ్వరం కొట్టుకుపోయిందని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేసిందన్నారు. మరమ్మత్తులు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సంసిద్ధంగా లేదన్నారు. మండుటెండల్లో మత్తడులు దుంకిస్తే ప్రభుత్వం ప్రస్తుతం 28 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రం పాలు చేస్తోందని దుయ్యబట్టారు. మిడ్మానేరు, ఎల్‌ఎండిలో 7 టిఎంసిల నీరు మాత్రమే ఉందని, కింది పంటలకు సాగునీరు ఎలా చేరుతుందని ప్రశ్నించారు. 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పటికి ప్రభుత్వం పట్టించుకోలేడన్నారు. సింకిశాల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌ఎస్‌ఐసిలో 8 మంది చనిపోయి ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పిసిసి అధ్యక్షుడు, మంత్రులకు మధ్య సమన్వయమే లేదని మాటలకు, చేతలకు పొంతనే ఉండడం లేదన్నారు. అమృత టెండర్ల విషయంలో బిజెపి పార్టీ చిత్తశుద్ధి ఉంటే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు, తులం బంగారు,రైతు బంధు, రైతు బీమా పథకాలకు ఇప్పటివరకు అతీగతీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి పార్టీ ఢల్లీిలో కేంద్ర అధిష్టానానికి చెప్పులు మోసేదైతే .. కాంగ్రెస్ పార్టీ సంచులు మోసేదనని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు తెలంగాణకు ద్రోహం చేస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. మూసీనది సుందరికరణకు తమ ప్రభుత్వం రూ.1100 కోట్లు అవసరం ఉంటే ప్రస్తుతకాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లు దుబారా చేసేందుకు యత్నిస్తోందన్నారు. బిఆర్‌ఎస్ అధికా రంలోకి వచ్చిన తర్వాత హెచ్ సియులో గ్రీన్ డోన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు అమ్మేటప్పుడు హెచ్‌ఎండీఏ, టిఎస్‌ఎస్‌ఐఐసి నుంచి అమ్మాలన్నారు.