హెచ్-1 మోసాలపై 5వేల ఫిర్యాదులు
వాషింగ్టన్,మే31(జనం సాక్షి): అమెరికాలో హెచ్-1బీ వీసా మోసాలపై ఫెడరల్ ఏజెన్సీకి దాదాపు 5వేలకు పైగా ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. హెచ్-1బీ వీసా మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు చేయడానికి గత ఏడాది అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం ప్రారంభించిన ఈమెయిల్ హెల్ప్‌లైన్‌కు ఈ ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. 2018 మే 21నాటికి యూఎస్‌సీఐఎస్ హెచ్-1బీ వీసా మోసాలపై 5వేల ఫిర్యాదులు అందుకుందని అమెరికా పౌర వలసల సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్) అధికార ప్రతినిధి ఫిలిప్ స్మిత్ వెల్లడించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ నేషనల్ సెక్యురిటీ డైరెక్టరేట్(ఎఫ్‌డీఎన్‌ఎస్) హెచ్-1బీ, హెచ్-2బీ వీసా మోసాలపై ఫిర్యాదులు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఈమెయిల్ సర్వీసులు ప్రారంభించింది. అమెరికన్లు సహా ఇంకెవ్వరైనా వీసా మోసాల బాధితులు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. మోసపోయినా, ఇతరుల్ని మోసం చేస్తున్నట్లు గుర్తించినా, వేధింపులకు గురిచేస్తున్నా, మోసాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ఫిర్యాదులు పంపించవచ్చని స్మిత్ తెలిపారు. అయితే అందిన ఫిర్యాదుల గురించి, వాటితో సంబంధం ఉన్న కంపెనీల గురించి, ఏ దేశాల వాళ్లు ఎక్కువగా మోసపోయారు, ఎలాంటి ఫిర్యాదులు అందాయనే అంశాల గురించి యూఎస్‌సీఐసీ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ఫిర్యాదుల్లో తీవ్రతను బట్టి మేజర్ కేసుల్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు క్రిమినల్ దర్యాప్తు చేపడతారని తెలిపారు.