హెచ్-4 వీసాల్లో 93 శాతం భారతీయులే
– ఎక్కువ మంది కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నారు
వాషింగ్టన్, మే12(జనం సాక్షి) : అమెరికాలో హెచ్-4 వీసాలు పొందిన వారిలో భారత్ నుంచే 93 శాతం మంది ఉన్నారని తాజా నివేదిక వెల్లడించింది. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల జీవిత భాగస్వాముల కోసం ఈ హెచ్-4 వీసాలు మంజూరు చేస్తారు. హెచ్4 వీసాలు పొందినవారిలో ఐదో వంతు కంటే ఎక్కువ మంది కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఉపాధి కోసం మంజూరు చేసిన హెచ్4 వీసాల్లో 93 శాతం మహిళలకు జారీచేయగా.. 7 శాతం పురుషులకు ఇచ్చారు. యూఎస్ కాంగ్రెస్ స్వతంత్ర కాంగ్రెషనల్ రీసెర్చ్ సంస్థ(సీఆర్‌ఎస్) ఈ నివేదికను వెల్లడించింది. యూఎస్ చట్టసభ సభ్యులకు ఆసక్తి ఉన్న అంశాలపై కాలానుగుణంగా ఈ సంస్థ నివేదికలను సిద్ధం చేస్తుంది. హెచ్4 కింద ఉపాధి కోసం జారీ చేసిన వీసాల్లో 93 శాతం భారత్‌కు చెందిన వారికి మంజూరు చేశాం. చైనాకు 5 శాతం మంజూరు కాగా.. ఇతర దేశాలకు చెందిన వారికి 2 శాతం వీసాలిచ్చాం’ అని సీఆర్‌ఎస్ తన 9 పేజీల నివేదికలో వెల్లడించింది. 2017, డిసెంబర్ 25 నాటికి హెచ్4 వీసాదారుల 1,26,853 దరఖాస్తులను అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ ఆమోదించింది. వీటిలో 90,946 ప్రాథమిక ఆమోదాలు ఉండగా.. 35,219 రెన్యూవల్స్, 688 కార్డులు కోల్పోయిన వారి కోసం జారీ చేసినవి ఉన్నాయి.