హెలీక్యాప్టర్ల కుంభకోణంలో త్యాగిపై కేసు

క్రిమినల్‌ కేసు ఎదుర్కోనున్న మొదటి ఎయిర్‌ చీఫ్‌
న్యూఢిల్లీ, మార్చి 13 (జనంసాక్షి):
హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మాజీ ఎయిర్‌ చీఫ్‌ త్యాగి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. త్యాగి సహా మరో 12 మందిపైనా కూడా కేసులు నమోదు చేసింది. మోసం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు మోపింది. దీంతో క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న తొలి వాయుసేన చీఫ్‌గా త్యాగి పేరొందారు. ఇటలీ సంస్థ ఫిన్‌మెకానిక, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో సీబీఐ రెండు కొత్త పేర్లను కూడా చేర్చింది. మాజీ కేంద్ర మంత్రి సంతోష్‌ బగ్రోడియా తమ్ముడు సతీష్‌, ఐడీఎస్‌ ఇన్ఫోటెక్‌ చైర్మన్‌, ఎండీ ప్రతాప్‌ అగర్వాల్‌పైనా కేసులు నమోదు చేసింది. రూ.3,600 కోట్ల విలువైన హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పంద కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఢిల్లీ, గుర్గావ్‌, చండీగఢ్‌ సహా దేశవ్యాప్తంగా 12 చోట్ల సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఫిన్‌మెకానిక, అగస్టా కార్యాలయాలు, ఐడీఎస్‌ ఇన్ఫోటెక్‌, ఏరోమాట్రిక్స్‌ ఆఫీసులు, త్యాగి నివాసం, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. 12 వీవీఐపీల హెలికాప్టర్ల కొనుగోలుఒప్పందంలో రూ.360 కోట్లు లంచాల రూపంలో చేతులు మారాయన్న అభియోగాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. దాదాపు 16 రోజుల ప్రాథమిక దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇటలీ నుంచి, అలాగే, రక్షణ శాఖ నుంచి వచ్చిన పత్రాల ఆధారంగా త్యాగి, ఇటలీ సంస్థ ఫిన్‌మెకానిక, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ సంస్థలపై సీబీఐ నేరపూరిత కుట్ర అభియోగాలు మోపింది.