హైకోర్టును తక్షణం విభజించండి

4
– తెలంగాణ ఎంపీలు

– హైకోర్టు ఏర్పాటు విభజన చట్టంలో భాగం

– ఎంపీ వినోద్‌

న్యూఢిల్లీ,జూన్‌ 28(జనంసాక్షి): తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు న్యాయమూర్తులు, న్యాయవాదుల సమస్య కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సమస్య అన్నారు టిఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌. కేంద్ర ¬ంమంత్రి రాజ్‌ నాథ్‌, డీవోపీటీ మంత్రి జితేందర్‌ సింగ్‌, న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ, ఆయా శాఖల కార్యదర్శులను ఢిల్లీలో కలిసిన టిఆర్‌ఎస్‌ ఎంపీల బృందం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు వెంటనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని, దాన్ని న్యాయంగా అమలు చేయమని మాత్రమే తాము కోరుతున్నామని వినోద్‌ అన్నారు.న్యాయాధికారుల విభజనకు డీవోపీటీ ప్రత్యేక కమిటీ వేసి నిర్ణయిస్తుందని విభజన చట్టంలో ఉందని ఎంపీ వినోద్‌ గుర్తుచేశారు. కమిటీ వేయలేదని, ఆదేశించలేదని డీవోపీటీ, కేంద్రం చెబుతోందని.. ఎవరి ఆదేశాలతో ఆంధ్రా జడ్జీలను తెలంగాణకు కేటాయించారో చెప్పాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ను డిమాండ్‌ చేశారు. హక్కులు భంగపడటం, అన్యాయం జరగడం వల్లనే నిరసన తెలియజేస్తారని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనలు చేస్తున్నారని, న్యాయమూర్తులు సామూహిక రాజీనామాలకు సిద్ధపడ్డారని వివరించారు.రాజ్యాంగంలోని 214 ఆర్టికల్‌ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండాలని ఎంపీ వినోద్‌ చెప్పారు. గతంలో విభజన జరిగిన రాష్ట్రాలకు వెంటనే ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేశారని, తెలంగాణకు ఎందుకు చేయరని ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్‌ 30లో రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు ఉంటాయని చెప్పిందని, హైకోర్టు ఎక్కడ ఉండాలో రాష్ట్రపతి నోటిఫై చేస్తారని సెక్షన్‌ 31లో ఉందని వివరించారు. చట్టం చేసే సమయంలో యూపీఏ తొందరపాటు వల్ల విభజన సమస్య జఠిలం అయ్యిందని చెప్పారు.రెండేళ్లలో హైకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేయాలో ఖచ్చితంగా నోటిఫై చేసి ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కాదన్నారు వినోద్‌. కేంద్రానికి బాధ్యత ఉంటే సెక్షన్‌ 31 సబ్‌ క్లాజ్‌ 2ను సవరణ చేయాలని వినోద్‌ డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో అన్ని పార్టీల మద్దతు తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము కేంద్ర ప్రభుత్వంతో కయ్యం పెట్టుకోదల్చుకోలేదని, రాజకీయం చేయదల్చుకోలేదన్నారు.హైకోర్ట్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తెలంగాణ న్యాయాధికారులను సస్పెండ్‌ చేయడం తమను ఆవేదనకు గురిచేసిందని ఎంపీ వినోద్‌ అన్నారు. ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర నిరసన తెలియజేస్తామన్నారు. దీనికి ప్రధాని మోడి, సదానంద గౌడ అనుమతి అవసరం లేదని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్‌ నిరసన తెలియజేసేందుకు సిద్ధం కావడంపై కేంద్రమంత్రి సదానంద గౌడ చేసిన వ్యాఖ్యలను వినోద్‌ తప్పుపట్టారు.తెలంగాణ జూనియర్‌ మరియు సివిల్‌ జడ్జీలు సంవత్సరన్నర నుంచి హైకోర్టుకు విన్నవించుకున్నారని, అయినా న్యాయం జరగడం లేదని ఎంపీ వినోద్‌ గుర్తుచేశారు. ఏపీలో పుట్టి అక్కడే న్యాయమూర్తులైన వాళ్ళను తెలంగాణకు కేటాయించడం సరికాదన్నారు. హైకోర్టులో తెలంగాణ జడ్జీలు ముగ్గురుంటే ఏపీ వాళ్ళు 18మంది ఉన్నారని వివరించారు. అందుకే మున్సిఫ్‌ కోర్టు నుంచి హైకోర్టు వరకు న్యాయవాదులు నిరసనలు తెలియజేస్తున్నారని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో మాట్లాడాలని ఎంపీ వినోద్‌ కోరారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న హైకోర్టు భవనాన్ని వదిలి వెళ్లడానికి తాము సిద్ధమేనని ఇప్పటికే చెప్పామని గుర్తుచేశారు.