హైకోర్టు విభజనపై సీజేతో చర్చిస్తా
– తెలంగాణ అడ్వకేట్లకు గవర్నర్ హామీ
హైదరాబాద్,జులై 4(జనంసాక్షి): న్యాయవాదుల సమస్యలను పరిస్కరించేందుకు గవర్నర్ నరసింహన్ తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ న్యాయవాదులు కలిశారు. గవర్నర్‌తో భేటీ ముగిసిన అనంతరం తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్ రావు విూడియాతో మాట్లాడారు. హైకోర్టు విభజన, ఏపీ జడ్జీల ఆప్షన్ల రద్దు, న్యాయాధికారుల సస్పెన్షన్ ఎత్తివేతపై గవర్నర్‌తో చర్చించామని తెలిపారు. గవర్నర్ తమ విన్నపాన్ని సానుకూలంగా విన్నారని పేర్కొన్నారు. హైకోర్టు విభజన విషయంలో తన వంతు కృషి చేస్తానని గవర్నర్ చెప్పారని వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో జరిగిన చర్చను గవర్నర్‌కు వివరించామని చెప్పారు. ఆందోళన విరమించమని గవర్నర్ కోరారు. కానీ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం విషయాన్ని పక్కతోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. హైకోర్టును విభజించి.. తక్షణమే న్యాయాధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు విభజన, జడ్జిలపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు పోరాటం ఆగదని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ స్పష్టం చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో గవర్నర్ మాట్లాడతామన్నారని జేఏసీ తెలిపింది. సమస్య పరిష్కరించాల్సింది కేంద్రమేనని న్యాయవాదులు అన్నారు. బీజేపీ ధర్నా రాజకీయ లబ్ధి కోసమేనని న్యాయవాదులు తెలిపారు. మా పోరాటానికి రాజకీయ పార్టీల మద్దతు అవసరం లేదని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ స్పష్టం చేసింది. ఇదిలావుంటే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి 8వ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు వద్ద న్యాయవాదుల ఆందోళన తీవ్రతరమైంది. సోమవారం ఉదయం న్యాయమూర్తులు కోర్టుకు వెళ్లకుండా న్యాయవాదులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు, న్యాయవాదులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల పహారాలో మేజిస్ట్రేట్ కోర్టులోకి వెళ్లారు. న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది.