హైకోర్టు విభజన కోర్టు పరిధిలో ఉంది

4

– చేతులెత్తేసిన కేంద్రం

– లోక్‌సభలో సదానందగౌడ ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 5(జనంసాక్షి): ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడ బుధవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. హైకోర్టుకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ సూచించిన చోట హైకోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కోర్టులో ఉన్న అంశంపై మాట్లాడలేనన్నారు. విభజన చట్టం మేరకు ప్య్రతేక హైకోర్టు ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని అంటూనే హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందన్నారు. హైకోర్టు ఏర్పాటుకు సంబందించి ఎపి ప్రభుత్వం స్థలాన్ని గుర్తించాలని, జడ్జిల ఇళ్ల వసతి మొదలైనవాటిని నిర్ణయించాలని ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. ఎపి ముఖ్యమంత్రి, ఛీఫ్‌ జస్టిస్‌ లను సత్వరమే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరామని ఆయన తెలిపారు. కాగా హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేసిందని, అందువల్ల ఇది సబ్‌ జ్యుడీస్‌ అవుతుందని సదానంద గౌడ అన్నారు. హైకోర్టు విభజన అంశం బుధవారం రెండోరోజు కూడా లోక్‌సభలో గందరగోళానికి దారితీసింది. కేంద్రం తీరును ఎండగడుతూ టిఆర్‌ఎస్‌ ఎంపిలు గట్టిగానే వాదించారు. రాజకీయంగా నిర్ణయం తీసుకోకుండా కావాలనే కాలయాపన చేస్తున్నారని అన్నారు. దీంతో ఒకింత గందరగోళం నెలకొంది. ఓ దశలో ఎంపి కవిత మాట్లాడుతూ చంద్రబాబు హైకోర్టును అడ్డంపెట్టుకుని తెలంగాణపై పెత్తనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇదిలావుంటే అంతకుముందు  మంగళవారం నాడు వెంకయ్య నాయుడు చేసిన ప్రకటన లో హైకోర్టు విబజన సత్వరం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం కాగా,సదానంద గౌడ ప్రకటన ఆ పాటి హావిూ కూడా ఇచ్చినట్లు కనిపించలేదు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తామని ఆయన అన్నారు. అయితే ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు స్థలాన్ని అన్వేషిస్తున్నామని కేంద్ర న్యాయశాఖమంత్రి సదానందగౌడ చెప్పారు. . హైకోర్టు విభజనకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన లోక్‌సభకు తెలిపారు. ఉమ్మడి హైకోర్టును అడ్డం పెట్టుకొని చంద్రబాబు తెలంగాణను పరిపాలించాలని భావిస్తున్నారని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత లోక్‌సభలో ఆరోపించారు. హైకోర్టు విభజనకు కేంద్రం సహకరించడం లేదని కవిత ఆరోపించారు. ఎంపీ కవిత చేసిన ఆరోపణలపై టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హక్కులన కాపాడాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టు విభజనను అడ్డుకుంటున్నారని విమర్శించారు. హైకోర్టు ద్వారా తెలంగాణపై పాలన సాగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆమె ఆరోపణలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా తిరస్కరించారు.  అనంతరం కేంద్రమంత్రి సదానందగౌడ మాట్లాడుతూ… ఎంపీ కవిత వ్యాఖ్యలతో తాను పూర్తిగా విభేదిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రమంత్రి సదానందగౌడ చేసిన ప్రకటనలో కొత్త అంశమేవిూ లేదని అన్నారు. విభజన సందర్భంగా ఇరరాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారని ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ పరమైన అంశమన్న ఆయన కేబినెట్‌ సమావేశమై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఏపీ హైకోర్టు ఏర్పాటుకు సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు… హైకోర్టు ఏర్పాటుపై ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే వెంటనే హైకోర్టు విభజన సాధ్యమని వివరించారు.  హైకోర్టు విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. లోక్‌సభలో హైకోర్టు విభజన అంశంపై వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రెండు రాష్ట్రాలను సమానంగా చూస్తామని ప్రకటించారు. సభలో లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించొద్దని సూచించారు. మాది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ అని వివరించారు. ఎంపీ కవిత వ్యాఖ్యలు చిన్నపిల్లల మాటల్లా ఉన్నాయన్నారు. హైకోర్టు విభజన అంశాన్ని రాజకీయం చేయొద్దని తెరాస ఎంపీలను కోరారు. టిడిపి ఎంపీ మల్యాద్రి మాట్లాడుతూ… సభలో లేని మా నేత గురించి కవిత ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. చట్టాన్ని అమలు చేయకుండా తమ నేతపైవ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.