హైతీలో ప్రకృతి ప్రకోపానికి 1,941 మంది బలి


దాదాపు పదివేలమందికి గాయాలు
హైతీ,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రకృతి ప్రకోపం హైతీని కుదిపేసింది. ఎంతోమందిని నిరాశ్రయులను చేసింది. మరెంతోమంది చిన్నారులను అనాథలను చేసి రోడ్డున పడేసింది. గత శనివారం 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి హైతీ దేశాన్ని అతలాకుతలం చేసిన విషయం విదితమే. ఈ విపత్తులో 1,941 మంది మరణించినట్లు ఆ దేశ సివిల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ మంగళవారం రాత్రి వెల్లడిరచింది. 9,900 మంది గాయపడ్డారని, వీరిలో చాలా మందికి ఇప్పటికీ ఎలాంటి వైద్య సాయం అందకపోవడంతో ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాస్తున్నారని పేర్కొంది. భూకంప దెబ్బ నుండి హైతీ కోలుకోకముందే గ్రేస్‌ తుపాను విరుచుకుపడటంతో మరింత నిస్సహాయ స్థితిలోకి వెళ్లింది. నిన్న చాలా ప్రాంతాలో భారీవర్షం కురవడంతో సహాయకచర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే చాలావరకు హైతీలోని ఇళ్లు, భవనాలు పూర్తి నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైతీ ప్రజలు మాట్లాడుతూ… 2010లోనూ హైతీలో భారీ భూకంపం వచ్చిందని, ఆ ప్రకృతి ప్రకోపంతో దాదాపు మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఆ తర్వాత పెను ప్రకఅతి విలయాన్ని మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని ఆవేదన చెందారు. ఈ భూకంపం కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారని, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు రోడ్డున పడి ఆకలితో అలమటిస్తున్నారని వాపోయారు. ఈ ఘోర భూకంప విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య నిన్నటికి దాదాపు 2 వేలకు చేరుకుంది. మరో 10 వేల మంది గాయాలపాలయ్యారు.