హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ దాడులు

1

– పలువురు అనుమానితుల అరెస్టు

హైదరాబాద్‌,జూన్‌ 29(జనంసాక్షి): హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి ఐస్‌ చేసిన ప్రణాళికను ఎన్‌ఐఎ బృందం ఛేదించింది. దీంతో బారీ ముప్పు తప్పింది. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఒక గ్రూప్‌గా ఏర్పడి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు పన్నిన కుట్ర బట్టబయలైంది. దేశవ్యాప్తంగా ఒక గ్రూప్‌గా ఏర్పడి ఉగ్రదాడులకు వ్యూహం రచించాలన్నది ఈ గ్రూప్‌ లక్ష్యం. వీరి ప్రయత్నాల్ని పసిగట్టిన ఢిల్లీ ఎన్‌ఐఏ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. బుధవారం ఉదయం స్థానిక పోలీసుల సహకారంతో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. ఈ సందర్భంగా పలువురు అనుమానితులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. 11మంది  అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు, మారణాయుధాలు, కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకొని.. వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు ముష్కరులు కుట్ర పన్నినట్లుగా అధికారులకు సమాచారం అందింది. ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ బృందం అనుమానిత ఆరుగురిని అదుపులోకి తీసుకొని దిల్లీకి తరలిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో కూడా సోషల్‌నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఓ బృందంగా ఏర్పడి దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు వ్యూహాలు పన్నిన వైనాన్ని ఎన్‌ఐఏ బృందం గుర్తించింది. అప్పుడు కూడా దాడులు నిర్వహించి పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంది. ఆసమయంలో కూడా హైదరాబాద్‌ లోనే తొలుత అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవటం గమనార్హం. ఒకవైపు టర్కీలోని ఇస్తాంబుల్‌ విమానాశ్రయంలో ఉగ్రవాద దాడి కలకలం రేపితే.. మరోవైపు హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఐఎస్‌ఐఎస్‌ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న 11మందిని ఎన్‌ఐఏ వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో పేలుళ్లకు ఐఎస్‌ఐఎస్‌ పన్నిన కుట్రను ఎన్‌ఐఏ భగ్నం చేసినట్లయింది. ఇంతకుముందు నిక్కీ జోసెఫ్‌ తో పాటు మరో యువకుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వాళ్ల విచారణ సమయంలో బయటపడిన వివరాల ఆధారంగానే తాజాగా 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కొంతమంది ఐఎస్‌ఐఎస్‌ సానుభూతిపరులు అరెస్టయిన ప్రాంతాల్లోనే వీళ్లు కూడా దొరికారని అంటున్నారు. దీంతో హైదరాబాద్‌లో కూడా ఐఎస్‌ఐఎస్‌ నెట్‌వర్క్‌ పనిచేయడం మొదలుపెట్టినట్లు తెలిసింది. తెలంగాణకు చెందిన ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కూడా ఈ అరెస్టులను నిర్ధారించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, విదేశీ కరెన్సీలను స్వాధీనం చేసుకున్నామని ఎన్‌ఐఏ అధికారులు కూడా తెలిపారు. ఈ ప్రాతంలో మరింతమంది ఐఎస్‌ఐఎస్‌ సానుభూతి పరులు ఉండే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.తెలంగాణ పోలీసుల సహకారంతో నగరంలోని 14 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు ఎన్‌ఐఏ ఐజీ సంజీవ్‌కుమార్‌ తెలిపారు. ఎన్‌ఐఏకు చెందిన అధికారులతో పాటు మొత్తం 100 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి పాతబస్తీలో సోదాలు జరిపారు. ఈ సందర్భంగా తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఇలియాస్‌ జగ్దానీ, మహ్మద్‌ ఇలియాస్‌ ఇబ్రహీం అనే సోదరులు సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు సోదరులే ఇక్కడి చర్యలకు కీలకంగా ఉన్నారని అనుమానిస్తున్నారు. అనుమానిత ఐఎస్‌ సభ్యుల నుంచి రూ.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరంతా సిరియాలోని ఐఎస్‌ ప్రధాన కార్యాలయంతో నిత్య సంప్రదింపులు జరుపుతున్నట్లు రూఢీ అయింది. హైదరాబాద్‌ నగరంలో వరుస పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో నగరంలోని పాతబస్తీ ప్రాంతాన్ని ఎన్‌ఐఏ అధికారులు, తెలంగాణ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 13 మంది ఐసిస్‌ సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్న అధికారులు, విూర్‌ చౌక్‌, మొగల్‌ పురా, భవానీనగర్‌, చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా గాలిస్తున్నారు. వీటితో పాటు పలు ఇతర ప్రాంతాల్లో కూడా ఎన్‌ఐఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలో పేలుళ్లు జరిపేందుకు ఐసిస్‌ కుట్ర పన్నిందన్న పక్కా సమాచారం అందడంతో ఎన్‌ఐఏ అధికారులు బుధవారం ఉదయమే హైదరాబాద్‌ చేరుకున్న అధికారులు బృందాలుగా విడిపోయి పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. ఇంతకుముందే అరెస్టుచేసిన నిక్కీ జోసెఫ్‌ తదితరులు విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ముందునుంచి అనుమానించినట్లే వాళ్ల వద్ద భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. వీళ్లంతా ఐసిస్‌ కార్యకర్తలేనా.. లేక స్లీపర్‌ సెల్స్‌ సభ్యులా అన్న విషయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.మామూలు రోజుల్లో ఏవో పనులు చేసుకుంటూ సాధారణ పౌరుల్లాగే జీవించే స్లీపర్‌ సెల్స్‌ సభ్యులు.. తమకు ఆదేశాలు అందిన మరుక్షణం ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టేందుకు సిద్ధమైపోతారు. తమకు హ్యాండ్లర్ల నుంచి అందే ఆదేశాలు, ఆయుధాలతో పని కానిస్తారు. ఇలాంటివాళ్లను ముందుగా గుర్తించడం కష్టం. కానీ సరైన టిప్‌ అందితే మాత్రం చివరి నిమిషంలో పేలుళ్లు చేపట్టడానికి ముందు కూడా పట్టుకునే అవకాశం ఉంది.