హైదరాబాద్‌లో దారుణం..16ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్ : నగరంలోని కామాటీపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గొల్లాకిడికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికపై 11మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కామాటీపుర పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గొల్లాకిడికి చెందిన 16ఏళ్ల బాలికపై 11 మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన సమయంలో వీడియోలు తీసి బాధితురాలిని బెదిరిస్తూ నరకం చూపించారు. ఈ విషయాన్ని బయటపెడితే సోషల్‌మీడియాలో వీడియో పెట్టి వైరల్ చేస్తామని బెదిరింపులకు దిగారు.
కామాంధుల చేష్టలతో విసిగిపోయిన బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు గత నెల 24న కామాటీపుర పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. బాలికపై గత నాలుగేళ్ల నుంచి అత్యాచారానికి పాల్పడినట్లుగా వైద్యుల రిపోర్టులలో తేలిందని తల్లిదండ్రులు చెప్పారు. ఆదివారం సుమారు 200 మంది స్థానికులు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. బాలికకు నరకం చూపించిన కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.