హైదరాబాద్‌లో మల్టీలెవల్‌ ఫ్లైఓవర్‌లకు అనుమతి

1

హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి):

హైదరాబాద్‌ ను విశ్వనగరంగా మార్చే లక్ష్యంతో నగరంలోని ప్రధాన చౌరస్తాలలో బహుళ అంతస్తుల ఫ్లయ్‌ ఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మొదటి దశలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 20 చౌరస్తాల్లో ఫ్లయ్‌ ఓవర్లను నిర్మించనున్నది. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 8వ తేదీన సమావేశమైన కమిటీ ఫ్లయ్‌ ఓవర్ల నిర్మాణానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించింది. కమిటీ మార్గదర్శకాల ఆధారంగా రూ. 2,631 కోట్ల రూపాయలతో ఫ్లయ్‌ ఓవర్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి నిర్మాణం కోసం ఈపీసీ విధానంలో టెండర్లను పిలిచి, నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. మొత్తం ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది.