హైదరాబాద్ అప్రమత్తత
– ముందుజాగ్రత్తగా తనిఖీలు
హైదరాబాద్,జూన్ 30(జనంసాక్షి): నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. నేటి నుంచి జులై 6 వరకు ముమ్మర తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో అప్పటివరకు సందర్శకులకు అనుమతి నిరాకరించడంతో పాటు, అన్ని రకాల పాసులు రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల ఏజెంట్లు పట్టుబడడం, టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రదాడుల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు, శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల వద్ద అక్టోపస్ బలగాలను మోహరించారు. అంతర్గత భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయానికి ఉన్న ప్రధాన రహదారుల్లో పోలీసు బలగాలను దించారు. సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలతోపాటు రక్ష సెక్యూరిటీ దళాలతో భద్రతను పెంచారు. ప్రధాన ద్వారం వద్ద వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గురువారం నుంచి జూలై 6వ తేదీ వరకూ హైఅలర్ట్ ప్రకటించారు. తనిఖీలు ముమ్మరం చేశారు. అన్ని రకాల పాసులు రద్దుచేశారు. సందర్శకులను అనుమతించడంలేదు. ఎయిర్‌పోర్టుకు వచ్చేవారు ఎయిర్ టికెట్లు, ఐడీ కార్డులు తెచ్చుకోవాలని అధికారులు విజ&ఢప్తి చేశారు. అలాగే నగరంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. షాపింగ్ మాల్స్‌లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మాదాపూర్ ఇన్‌ఆర్బిట్ మాల్, సైబర్‌టవర్ సహా మరికొన్ని ప్రదేశాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. వాహనాలను కూడా తనిఖీ చేపట్టారు. భాగ్యనగరంలో మారణ ¬మానికి ఐఎస్ ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఎన్‌ఐఏ, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా భగ్నం చేసిన విషయం తెలిసిందే. అయితే నగరంలో పేలుళ్లకు ప్రయత్నిస్తారన్న సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదిలావుంటే పాతబస్తీలోని చార్మినార్ పక్కనున్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఐసిస్ లక్ష్యంగా చేసుకుందా? అంటే అవుననే అంటున్నాయి ఎన్‌ఐఏ వర్గాలు. పాతబస్తీలో అదుపులోకి తీసుకున్న ఐసిస్ సానుభూతిపరుల నుంచి ఎన్‌ఐఏ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని పేల్చేయాలని ఐసిస్ లక్ష్యంగా చేసుకున్నట్లు సానుభూతిపరులు విచారణలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు శక్తివంతమైన బాంబులతో పోలీస్‌స్టేషన్ పైకి దాడికి కుట్ర పన్నారని ఎన్‌ఐఏ అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులు నగరంలో మతకల్లోలాలు సృష్టించడానికి ప్రణాళిక రచించినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. నగరంలో పలు ప్రధాన దేవాలయాల్లో ముఖ్యంగా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో ఆవు, ఎద్దు మాసం ఉంచి మత కల్లోలాలకు ఆజ్యం పోయాలనుకున్నారన్నారు. ఉగ్రవాదుల ఫోన్‌ను ట్యాప్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన సమాచారం లభించినట్లు, దీని ఆధారంగానే హైదరాబాద్‌లో పదకొండు మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అరెస్టయిన వాళ్లల్లో ఇద్దరు జూన్ 25న ఫోన్‌లో మాట్లాడుకున్నారని, వాళ్లు ఆవు, ఎద్దు మాంసం గురించి మాట్లాడుకున్నారన్నారు. ‘నాలుగు ముక్కలు ఆవు మాంసం, నాలుగు ముక్కలు ఎద్దు మాంసం తీసుకొని రా’ అని ఫొన్లో ఒక వ్యక్తి అవతలి వ్యక్తికి చెప్పినట్లు ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. ‘ఈ సమాచారంతోనే ఆ ఉగ్రవాదులను మేము పట్టుకున్నాం. నగరంలోని దేవాలయాల్లో ఆవు మాంసం వేయాలనుకున్నారు. ముఖ్యంగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి దేవాలయం వాళ్ల ప్రధాన లక్ష్యం’ అని ఎన్‌ఐఏ అధికారి ఒకరు తెలిపారు. ఇలా చేయడం ద్వారా రంజాన్ పండుగ సందర్భంగా నగరంలో మత కల్లోలం సృష్టించి, అలజడులు రేపడానికి పథకం వేశారని ఆయన అన్నారు.