హైదరాబాద్ అభివృద్దిని విస్మరించిన పాలకులు
హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్న పాలకుల హావిూలు నెరవేరలేదు. ఇష్టారాజ్యంగా కట్టడాలు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితం అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు, ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై సిఎం కెసిఆర్ ఘాటుగా స్పందించి నగరాన్ని నవీకరిస్తామన్న హావిూలు నాలాల్లో కొట్టుకు పోయాయి. కనీసం ట్రాఫిక్ క్రమబద్దీకరణ కూడా సక్రమంగా సాగలేదు. నాలుగేళ్లలో నగరాభివృద్ది విషయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్దిని ప్రకటించలేదు. చెత్త ఎత్తిపోతలకు డబ్బాలు పంచి అదే స్వచ్ఛభారత్ అన్న చందంగా ప్రచారం చేసుకుంది. మున్సిపల్ శాఖ మంత్రిగా కెటిఆర్ బాధ్యతలు తీసుకున్నా నగర సుందరీకరణ, ట్రాఫిక్ సమస్యలపై పెద్దగా దృష్టి సారించలేదు. ఏదో చల్తీకా నామ్ గాడీ అన్నచందంగా హైదరాబాద్ తనంతతానుగా ముందుకు సాగుతున్నది. ఇక్కడి ప్రజలు కూడా కష్టాలకు అలవాటు పడ్డారు. జిహెచ్‌ఎంసిలో వందసీట్లు గెల్చుకున్నామని జబ్బలు జరుస్తున్న అధికార పార్టీ వారు ఏం చేశారని వెనక్కి తిరిగి చూస్తే ఏవిూ లేదని కళ్లకు కనిపిస్తుంది. కేవలం ఓట్లు..సీట్లు తప్ప నగర అభివృద్ది ప్రణాళిక అన్నది లేకుండా పోయింది. నగరం చారిత్రకంగా ఎంతో భాసిల్లింది. ఇక్కడ తరతమ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు జీవిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగానే ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే రియల్టర్ల పాపానికి ప్రజలు బలవుతున్నారు. ఎప్పుడు వర్షాలు పడ్డా భారీ వర్షాల దెబ్బకుచెన్నై, ముంబయి, దిల్లీ వంటి మహా నగరాలు కుదేలయ్యాయని మాత్రమే చూస్తున్నాం. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు వర్ష నీటి ప్రవాహాలకు ఉద్దేశించిన నాలాలెన్నో అక్రమ నిర్మాణాల బారిన పడడంతో రాజధాని నీటమునగడానికి కారణభూతమైంది. అందుకే హైదరాబాద్ లో గుర్తించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడం, నాలాల ఆక్రమణలను తొలగించడం కోసం సిఎం కెసిఆర్ గతంలో ప్రకటనలు చేసినా… అవి అక్కడితోనే ఆగిపోయాయి. తీసుకున్న నిర్ణయాలు పక్కాగా అమలు కావడానికి చిత్తశుద్ది ప్రకటించలేదు. హైదరాబాద్‌ను ఓ రకంగా సీమ గూండాలు ఆక్రమించుకుని తమ రియల్ వ్యాపారానికి సర్వనాశనం చేశారు. ఇక్కడి భూములను ఆక్రమించుకుని అడ్డదిడ్డంగా ఇళ్లు కట్టి సొమ్ము చేసుకున్నారు. హైటెక్ సిటీ ఎంత డొల్లగా నిర్మితమయ్యిందో డ్రైనేజీ వ్యవస్తను చూస్తే అర్థం అవుతుంది. రాజకీయ నాయకుల ఆక్రమణల వల్లనే ఇవాళ నగరం అస్తవ్యస్తంగా తయారయ్యింది. ఇంకా అక్రమ కట్టడాలు, చెరువుల ఆక్రమణలు కనిపిస్తున్నా కఠిన చర్యలకు ఉపక్రమించిన దాఖలాలు లేవు. అడపాదడపా కొన్నిచోటల్ ఆక్రమణ కూల్చివేత తప్ప చేసిందేవిూ లేదు. ఇం కాఅక్కడక్కడా చెరువులను ఆక్రమిస్తూనే ఉన్నారు. గతంలో బండారి లే అవుట్‌లో వర్షాలకు ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడ్డారో గమనించాం. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు పూనుకుంటారని భావించినా చిత్తశుద్ది కానరాలేదు. కాసులకు కక్కుర్తి పడే నేతల కారణంగా హైదరాబాద్ ప్రభ మసక బారుతోంది. ఇష్టం వచ్చినట్లుగా లేఔట్లు వేసి, చెరువులను కబ్జాచేసిన పాపానికి ఫలితం కనిపిస్తున్నా ఇంకా వేచిచూసే ధోరణి సరికాదు. సిఎం కెసిఆర్ కఠిన నిర్ణయం మేరకు ఆక్రమణల తొలగించి,నగరాన్ని అద్భుతంగా తీర్చి దిద్ది వుంటే ప్రజలు జేజేలు పలికేవారు. మెట్రో రూట్లలో నిర్మాణం కారణంగా ప్రజలు ట్రాఫిక్ కష్టాలు పడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. నగరంలో అడ్డదిడ్డంగా కట్టడాలకు, ఆక్రమణలకు, నాలాలను ఆక్రమణలకు బాధ్యులైన గత అధికారులు, బిల్డర్లు, రియల్టర్లపై చర్యలు తీసుకుంటే కొంత భయం ఉండేది. అంతెందుకు నటుడు నాగార్జు ఎన్ కన్వెన్షన్ విషయంలో ఏం జరిగింది.? ఎందుకు ఆ విషయాన్ని దాచేశారు. ఆక్రమణలను ఎందుకు తొలగించలేదు. ఈ ఒక్క విషయం చాలు..
నేతల కక్కుర్తి ఏరకంగా ఉందో చెప్పడానికి.. కఠినంగా వ్యవహరించి ఉంటే పాలకుల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేది. కిర్లోస్కర్ కమిటీ నివేదిక ప్రకారం 390 కి.విూ. నాలాలుంటే, మూసీకి దారితీసే 170 నాలాలపై నూరు శాతం అక్రమ నిర్మాణాలున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వాటన్నింటినీ తొలగిస్తా మంటున్న కేసీఆర్, ఇక ముందూ అక్రమ నిర్మాణాల్ని ఉపేక్షించేది లేదన్నారు. రాజధానిలో 165 చెరువులు అసలు కనిపించడమే లేదని రెవిన్యూ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించిన మహానగర పాలక సంస్థ అధికారులు బిల్డర్లతో లాలూచీపడి అక్రమ నిర్మాణాలకు కారణభూతు లయ్యారు. అనుమతులు ఇచ్చిన అధికారుల్ని, సంపాదించిన బిల్డర్లను వదిలేసి, జీవితకాల కష్టార్జితాన్ని ధారపోసి ఇళ్లు కొనుక్కొన్న వారిని రోడ్డున పడేస్తున్నారు. ఇకపోతే మిషన్ కాకతీయ గురించి గొప్పులు చెప్పుకుంటున్న వారు నగరంలో,శివార్లలో కనీసం ఒక్క చెరువును అయినా ఎందుకు బాగు చేయలేదు. అక్రమ కట్టడాల తొలగింపులో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా రెండు పడక గదుల ఇళ్లను కట్టిస్తామన్న సర్కారు, ముందువారికి ఆవాసాలు చూపించాకే వాళ్లను ఖాళీ చేయించాలి. అసాధారణ వర్షాలు వచ్చినప్పుడు సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎక్కడైతే నాలాలను అక్రమంగా ఆక్రమంచు కున్నారో అక్కడే నీట మునుగుతున్నాయి. అయినా నగరంలో నిర్మించిన అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేయాల్సిందే. హైదరాబాద్‌లో ఈ దుస్థితికి గత ప్రభుత్వాలే కారణం. వాటిని సరిదిద్దడంలో నేటి పాలకు విఫలం అయ్యారు. అయినా నగరం గురించి ఎవరు కూడా తమ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించకపోవడం గమనార్హం.