హైదరాబాద్ కవాతుతో ఢిల్లీలో ప్రకంపణలు రావాలి
సెప్టెంబర్ మార్చ్‌కు సర్వం సిద్ధం
జేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్ : సెప్టెంబర్ 30న నిర్వహించనున్న హైదరాబాద్ కవాతుతో ఢిల్లీలో ప్రకంపనలు రావాలని, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఉప్పల్ నియోజకవర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని, అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించే దిశగా జేఏసీ నాయకులు కృషి చేయాలని ఆయన కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉప్పల్ నియోజకవర్గమే ఉద్యమపరంగా ముందంజలో ఉందని, సెప్టెంబర్ 30న ఈ నియోజకవర్గం నుంచే 50 వేల మందిని తరలించాలని కోదండరాం జేఏసీ ప్రతినిధులకు సూచించారు. తెలంగాణ మార్చ్ నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో గ్రూపు మీటింగులు, పాదయాత్రలు, బైకు యాత్రలు, ధూంధాం కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. అంతే కాకుండా, జేఏసీ కార్యకర్తలతో అన్ని బస్తీలు, కాలనీల్లో విస్తృత ప్రచారాన్ని చేయాలని కోదండరాం కోరారు. తెలంగాణ మార్చ్ విజయవంతానికి కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఉప్పల్ నియోజకవర్గంలో ఇదే విషయమై పది వేల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.