హైదరాబాద్ టు ముంబై బుల్లెట్ రైలు
` ప్రణాళిక సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్,సెప్టెంబరు 27(జనంసాక్షి): హైదరాబాద్‌లో మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో భాగ్యనగర వాసులకు లోకల్‌గా.. ప్రత్యేకించి వివిధ సంస్థల్లో ప్రత్యేకించి ఐటీ రంగంలో పని చేసే వారికి సౌకర్యంగా మారింది.. అటువంటిదే మరో సౌలభ్యం అందుబాటులోకి రాబోతున్నది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైకి మూడు గంటల్లో వెళ్లగలమని ఊహించగలమా.. కానీ సవిూప భవిష్యత్‌లో అది నిజం కాబోతున్నది. హైదరాబాద్, ముంబై మధ్య బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. హైదరాబాద్`ముంబై మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు చేపట్టడానికి గల సాధ్యాసాధ్యాలపై అధికార వర్గాలు ఇప్పటికే సర్వే నిర్వహించాయని ఓ వార్తా కథనం ప్రచురితమైంది.రెగ్యులర్ ప్రయాణంలో 14 గంటలు ఇప్పుడు హైదరాబాదీ రెగ్యులర్ రైలులో ముంబైకి వెళ్లాలంటే సుమారు 650 కి.విూ. దూరం ప్రయాణించాలి. దానికి 14 గంటల టైం పడుతుంది. అదే ముంబై`హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు గానీ, హై స్పీడ్ రైలు గానీ అందుబాటులోకి వస్తే కేవలం మూడు గంటల్లో ముంబైకి చేరుకోవచ్చు.
11 స్టేషన్ల విూదుగా బుల్లెట్ రైలు జర్నీ
ముంబై`హైదరాబాద్ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తుందని మహారాష్ట్రలోని ఠాణె జిల్లాల పరిధిలోని పల్లెల ప్రజానీకానికి సమాచారం ఇచ్చారని తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపితే.. హైస్పీడ్ రైలు.. తెలంగాణ, మహారాష్ట్రల్లోని 11 రైల్వే స్టేషన్ల విూదుగా ముంబై, పుణెలకు కలుపుతుందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్‌ఎస్సార్సీ) అధికారి ఒకరు చెప్పారు.
650 కి.విూ. మేర గ్రీన్ కారిడార్ ఇలా
ఈ ప్రాజెక్టుపై ఠాణె భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ ప్రశాంత్ సూర్యవంశి, ఇతర అధికారులకు డిటైల్డ్ ప్రెజెంటేషన్ సమర్పించామని ఎన్హెచ్‌ఎస్సార్సీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్ కే పాటిల్ తెలిపారు. ఈ హై స్పీడ్ రైలు పరిధిలో 649.76 కి.విూ. గ్రీన్ కారిడార్ ఏర్పాటవుతుందన్నారు. దీనికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్`డీపీఆర్ ప్రస్తుతం సిద్ధం అవుతుందన్నారు.
ఠాణెలో 1200 హెక్టార్ల భూసేకరణ
ప్రతిపాదిత హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు ఠాణెతోపాటు నేవీ ముంబై, లోనావాలా, పుణె, బారామతి, పందార్‌పూర్, షోలాపూర్, గుల్బర్గ, వికారాబాద్, హైదరాబాద్ వరకు చేపడతారు. మహారాష్ట్రలోని నాలుగు జిల్లాలు ఠాణె, రాయిగఢ్, పుణె, షోలాపూర్ జిల్లాల విూదుగా ఈ ప్రాజెక్టు వెళుతుంది. దీని నిర్మాణానికి ఠాణె జిల్లాలో 1200 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు.