హైప్‌ క్రియేట్‌ చేసిన హుజూరాబాద్‌ ఎన్నిక ప్రచారం

టిఆర్‌ఎస్‌,బిజెపిలకు ప్రతిష్టగా మారిన ఎన్నిక
గెలుపు తమదే అని లెక్కలు వేసుకుంటున్న టిఆర్‌ఎస్‌ నేతలు
ఈటెలు గెలుపుతో కెసిఆర్‌కు చెక్‌ పెట్టాలని బిజెపి యత్నాలు
హుజూరారాబాద్‌,అక్టోబర్‌27( జనం సాక్షి);  హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారం గడవువు ముగుస్తున్న వేళ ప్రచారం తీరు చూస్తుంటే ఈ ఎన్నిక గతంలో కన్నా ఎంతో ప్రాధాన్యం దక్కించుకుంది. అక్కడ మద్యం ఏరులై పారుతోంది. డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ జరుగుతోంది. ఈ ఎన్నిక మొత్తం కెసిఆర్‌ వర్సెస్‌ ఈటెల అన్నట్లుగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రచారం కూడా అదేస్థాయిలో సాగింది. కెసిఆర్‌ వ్యూహాల మేరకు మంత్రి హరీష్‌ రావు ప్రచారంలో సామ,భేద,దాన దండోపాయాలు ప్రయోగించి సాగుతున్నారు. ఈటెల రాజేందర్‌, బిజెపిలు పప్రచారం కూడా అంతే స్థాయిలో సాగింది. కాంగ్రెస్‌ రంగంలో ఉన్నా ప్రచార ఉధృతి అంతగా కానరావడం లేదు. ఈ క్రమంలో 30న జరిగే పోలింగ్‌లో గెలుపు ఎవరిది అన్నది ఇప్పుడే
చెప్పలేని పరిస్థితి ఏర్పడిరది. ప్రచారం ఎంత ఉధృతంగా ఉంటే తమ విజయావకాశాలు అంత మెరుగు పడతాయని టీఆర్‌ఎస్‌ స్థానికనేతలు అంచనా వేస్తున్నారు. దళితబంధు అమలు కావడానికి కొన్నిరోజుల సమయం పట్టవచ్చు. ఈలోగా మిగతా పథకాలన్నీ పట్టాలకెక్కించాలని వారంతా అమలు చేశారు. అయితే టిఆర్‌ఎస్‌ దూకుడుతో హుజూరాబాద్‌లో గెలుపుపై బీజేపీ నాయకులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యిందని భావిస్తున్నారు. ఈ ఉపఎన్నిక ముఖ్యమంత్రి కేసీఆర్‌ దక్షతకు,ప్రతిష్టకు సవాల్‌గా మారింది. కెసిర్‌ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని బిజెపి, కాంగ్రెస్‌ నేతల నుంచి సమాధానం వస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలనూ ప్రయోగించినప్పటికీ హుజూరాబాద్‌లో ఓడిపోతే కేసీఆర్‌కు రాజకీయంగా శరాఘాతమే అవుతుంది. పార్టీ తరఫున చతురంగ దళాలను రంగంలోకి దించడంతో పాటు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించినా ఫలితం లేకపోతే కేసీఆర్‌కు అంతకు మించిన అవమానం ఉండదని అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదన్న అభిప్రాయం కూడా ప్రచారం సాగుతుంది. ఇదే సమయంలో దుబ్బాక తరహాలో స్వల్ప మెజార్టీతో గెల్చినా పర్వాలేదన్న ధీమాలో బిజెపి ఉంది. గెల్లు శ్రీనివాసయాదవ్‌, ఈటెల రాజేందర్‌, గట్టి అభ్యర్థులు కావడంతో విజయం అంచనా వేయడం కష్టమే. ఏకపక్షంగా ఉంటుందని భావించడానికి లేదు. ఈ కారణంగానే ఎలాగైనా హుజూరాబాద్‌లో గెలిచి తన అధికారాన్ని పదిల పరచుకోవాలని కేసీఆర్‌ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయితే ఆయన ఇందుకోసం రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. ప్రభుత్వ డబ్బుతో పథకాల పేరున ఓటర్లను ఆకట్టుకునేలా మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ చర్యల వల్ల ప్రజల్లో ఆశలు రెట్టిరపు అవుతున్నాయి. తమ ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికార టిఆర్‌ఎస్‌ ఏదడిగినా ఇస్తుందన్న భరోసా ఏర్పడిరది. దీంతో టీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రులు, శాసనసభ్యులూ ఊరూరా తిరిగి పథకాలను ప్రచారం చేశారు. దళితబంధును బిజెపి ఆపించిందని ఎదురుదాడికి దిగారు.
హుజూరాబాద్‌ కారణంగా మగితా నియోజకవర్గాల ప్రజల నుంచి తమకు కూడా దళిబంధు కావాలని ఒత్తిడి వస్తోందని నేతలు వాపోతున్నారు. ఇప్పటివరకు కేసీఆర్‌ వేసిన రాజకీయ ఎత్తుగడలకు తిరుగుండేది కాదు. ఇప్పుడు పరిస్థితులు అలా కనిపించడం లేదని విపక్షాల్లో చర్చమొదలయ్యింది. గతంలో ఏ ఎన్నిక జరిగినా ఆడుతూ పాడుతూ గెలుచుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ప్రతి ఎన్నికలో విజయం కోసం చెమటోడ్చాల్సి వస్తోంది. అలాగే ఇప్పటివరకు కేసీఆర్‌ తన వాగ్దాటితో తెలంగాణ ప్రజలను కట్టిపడేసేవారు. ప్రతి ఎన్నికల్లో ధనబలంతో గెలిచి పరువు నిలబెట్టుకున్నారు. అదే సమయంలో తెలంగాణలో ప్రతిపక్షాలు క్రియాశీలం అయ్యాయి. నిన్నటివరకు బీజేపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ వచ్చింది. రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆయన కూడా ప్రచారంలో తన వాగ్ధాటిని ప్రదర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరు వెంకట్‌ పెద్దగా ప్రభావం చూపకపోయినా ప్రచారంలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. రేవంత్‌ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది. అదే ఇప్పుడు హుజూరాబాద్లోనూ కొంత ఊపు తీసుకుని వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన దళిత, ఆదివాసీ దండోరా సభలు విజయవంతం కావడంతో రేవంత్‌ నాయకత్వంపైనా ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతోంది. మొత్తం విూద తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉందన్న నమ్మకం కల్పించడంలో రేవంత్‌రెడ్డి కృతకృత్యులయ్యారు. యువతో మాత్రం జోష్‌ నింపగలుగుతున్నారు. కేసీఆర్‌కు గట్టిగా ఎదురునిలిచి ప్రతిఘటించే నేతగా రేవంత్‌ ప్రజల దృష్టికి ఆకర్శిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హుజూరాబాద్‌లో యువత ఆయనవైపు చూస్తోంది. నిన్నటివరకు కాంగ్రెస్‌లో స్తబ్దత ఉండటంతో
పాటు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్‌ వంటి వారు కేసీఆర్‌ను ధాటిగా ఎదుర్కోవడంతో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సమ ఉజ్జీలుగా హుజూరాబాద్‌ వేదికగా కేసీఆర్‌తో తలపడుతున్నాయి. ఈ పరిణామం తమకు మేలు చేస్తుందని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు రెండు పార్టీల మధ్య చీలిపోయి తమకు లాభిస్తుందని టిఆర్‌ఎస్‌ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తానికి హుజూరాబాద్‌ పోటీ ఎవరికీ అంత ఈజీ కాదని గుర్తుంచుకోవాలి. బిజెపికి కూడా అంత సుభలం కాకపోవచ్చు. చివిరి నిముషం వరకు ఓటర్లను విడవకుండడా ప్రచారం చేయడంతో కలసి వస్తుందని అంటున్నారు. ప్రచారం బుధవారం సాయంత్రం ముగియగానే స్థానికేతరులు వెళ్లి పోవాల్సి ఉంటుంది. దీంతో ఇంటింటి ప్రచారం, ప్రలోభాలు ఎక్కువ కానున్నాయి.