హ్యాట్సాఫ్.. ఆఫీసర్స్..!
జనంసాక్షి, మంథని : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంథని నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మంథని మానేరు పరివాహక ప్రాంతంలో గురువారం భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మంథని మండలం గోపాలపూర్ ఇసుక రీచులో పనిచేస్తున్న 19 మంది కార్మికులు వరదల్లో చిక్కుకున్నారు. ఇసుక రీచు చుట్టూ నీరు వచ్చి చేరడంతో అక్కడ ఉన్న జెసిబి ని ఆశ్రయించిన రీచ్ వర్కర్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలాన్ని వెల్లదిశారు. ఈ సమాచారం అందుకున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, డిసిపి వైభవ్ గైక్వాడ్, మంథని ఆర్డీవో హనుమ నాయక్ , గోదావరిఖని ఏసిపి తులా శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో కుండపోత వర్షంలో పడవలు ( స్టీమర్లు ) తెప్పించి వారిని ఒక్కొక్కరిగా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, పోలీస్ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వరదల్లో ఇసుక రిచ్ లోని ఒక కంటైనర్, జేసీబీలు కూడా వరద ఉధృతికి కొట్టుకు పోయినట్లు తెలిసింది. ఈ సహాయక చర్యల్లో మంథని ఎంపీపీ కొండా శంకర్, గోపాల్ పూర్ సర్పంచ్ సునీత, మంథని సీఐ సతీష్ తో పాటు పలువురు సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, పలు శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.