తమిళనాట జయకేతనం!

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఏఐఏడీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 232 స్థానాలకు గాను ఏఐఏడీఎంకే 126 స్థానాల్లో విజయం సాధించగా 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డీఎంకే 94 స్థానాల్లో విజయం సాధించగా 6 స్థానాల్లో  ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 232 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.చెన్నైలో జయకు ఎదురుదెబ్బ
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఏఐఏడీఎంకే స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తొంది. దీంతో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని జయలలిత అధిష్టించనున్నారు.

అయితే చెన్నై నగరంలో మాత్రం జయలలితకు ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై నగరంలో మొత్తం 16 స్థానాలు ఉండగా డీఎంకే అధిక స్థానాల్లో ఆధిక్యం సాధించింది. కోయంబత్తూరు జిల్లాలో అన్నా డీఎంకే హవా ఏకపక్షంగా కొనసాగుతోంది.

కొయంబత్తూరు, సేలంలో అమ్మ హవా
కొయంబత్తూరు జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉండగా అన్నా డీఎంకే 9, డీఎంకే 1 ఒకస్థానంలో ముందంజలో ఉన్నాయి. మధురై జిల్లాలో మాత్రం అన్నా డీఎంకే ఆధిక్యం కనబరుస్తోంది. జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉండగా అన్నా డీఎంకే 8, డీఎంకే 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. తిరుచిరాపల్లి జిల్లాలో డీఎంకే 5, అన్నాడీఎంకే 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సేలం జిల్లాలో మొత్తం 11 స్థానాలు ఉండగా అన్నా డీఎంకే 10, పీఎంకే ఒక స్థానంలో దూసుకెళ్తున్నాయి. విల్లుపురం జిల్లాలో డీఎంకే ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.

పోయస్‌ గార్డెన్‌లో సంబరాలు
ఇప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల ప్రకారం ఏఐఏడీఎంకే ముందజంలో ఉంది. దీంతో పార్టీ శ్రేణులు జయలలిత అధికారిక నివాసం పోయస్‌ గార్డెన్‌కు భారీగా చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు.

1989 తర్వాత తమిళనాడులో వరుసగా రెండో సారి అధిక్యం సాధించిన పార్టీగా ఏఐఏడీఎంకే చరిత్ర సృష్టించనుంది. ఇప్పటి వరకు జయలలిత ఐదు సార్లు, కరుణానిధి ఐదు సార్లు సీఎం పీఠాన్ని అధిష్టించారు. ప్రస్తుతం ఏఐఏడీఎంకే విజయం సాధిస్తే ఆరోసారి జయలలిత సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు.