12నుంచి ఉపల్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్
– 1500మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం
– రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్
హైదరాబాద్, అక్టోబర్9(జనంసాక్షి) : ఉప్పల్ స్టేడియంలో ఈనెల 12న భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరగబోయే రెండో టెస్టు జరగనుందని, ఈ మ్యాచ్‌కు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మ్యాచ్ సందర్భంగా 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులతో పాటుగా స్టేడియం మేన్‌జ్‌మెంట్ కూడా ప్రత్యేకంగా ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. 100సీసీ టీవీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశామని తెలిపారు. రెండో టెస్టుకు హాజరయ్యే
ప్రేక్షకులు భద్రత అధికారుల సూచనలు పాటిస్తూ సెల్‌ఫోన్ తీసుకెళ్లవచ్చునని తెలిపారు. లాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్‌బ్యాంక్‌లు, ఎలక్టాన్రిక్ ఐటమ్స్, కాయిన్స్, లైటర్స్, హెల్మెట్స్, ఫెర్ప్యూమ్స్, బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, బయటి తినుబండారాలకు అనుమతి లేదని వివరించారు. ఫోర్ వీలర్ వాహనాలకు 16చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామని, 4900 వరకు బైక్‌లను పార్కింగ్ చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. కాగా మ్యాచ్ చూసేందుకుగాను ప్రతిరోజు 4 వేల మంది పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు ఉప్పల్ స్టేడియం చుట్టూ పటిష్ఠ బందోబస్తు ఉంటుందని, ఆంక్షలు ఉంటాయని తెలిపారు.