ఎండల తీవ్రతతో తప్పని ఉక్కపోత
విశాఖపట్టణం,జూన్18(జనం సాక్షి): రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. నైరుతి ప్రవేశించి పదిరోజులు దాటినా పెద్దగా వర్షాలు పడడం లేదు. అక్కడక్కడా చినుకుల తప్ప మేఘాలు విస్తరించడం లేదు. దీంతో ఎండల ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాటు ఉక్కపోత కడా తప్పడం లేదు. అల్పపీడనాలు ఏర్పడి అవి కదిలితే తప్ప వర్షాలు పడని దుస్థితి ఏర్పడింది. మరోవైపు ఆకాశం నిర్మలంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. రెండ్రోజులు తర్వాత జార్ఘండ్‌పై ఉన్న ద్రోణి కిందకు దిగితే రాష్ట్రంపైకి తేమ గాలులు వచ్చి వాతావరణం చల్లబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండలు కాస్తున్నందున సాయంత్రం అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు పడ్డాయి. విశాఖలోని మధురవాడలో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. విశాఖలో 41.4, కళింగపట్నంలో 37, ఒంగోలు 41, రెంటచింతల 42, కాకినాడ 41, నందిగామ 39, మచిలీపట్నం 41, నెల్లూరు 40, తిరుపతి 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఒడిశాకు అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 7.6 కిలోవిూటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండి తెలిపింది. మరోవైపు బీహార్ నుంచి జార్ఘండ్ విూదుగా పశ్చిమ బంగాళాఖాతం వరకూ 7.6 కిలోవిూటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో పశ్చిమ దిశ నుంచి ద్రోణి, ఆవర్తనం కొనసాగుతున్న బంగాళాఖాతం వైపునకు వేడి గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.