13వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష.

బూర్గంపహాడ్ ఆగష్టు31 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సాగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్షలు నేటికీ 13వ రోజుకు చేరుకున్నాయి. నేడు దీక్షలో పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు పాల్గొన్నారు. వారికి మాజీ ఎమ్మెల్యే కుంజా బిక్షం సతీమణి మహిళా కో-ఆర్డినేటర్ కుంజా వెంకటరమణ, ఎస్.కె గౌష్యా బేగం పూలమాలలు అందించి దీక్ష ప్రారంభించారు. బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు దీక్షకు వచ్చి కూర్చొని వారికి సంఘీభావం తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ13 రోజులగా మండల కేంద్రంలో ముంపు ప్రాంత ప్రజలు మాకు న్యాయం చేయండి అంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తూ ప్రజలు అల్లాడుతున్నప్పుడు వారి గోడు పట్టించుకొని తగిన న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె దస్తగిరి, దాసరి సాంబ, రావులపల్లి తిరుపతి, పోలుకొండ ప్రభాకర్, ఆటో యూనియన్ సభ్యులు, జేఏసి కన్వినర్ కే వి రమణ, జేఏసీ ప్రధాన కార్యదర్శి దామర శ్రీను పాల్గొని సంఘీభావం తెలియజేశారు.