చంద్రబాబు ముందుకు..కెసిఆర్ వెనక్కి
ఫోర్త్ ఫ్రంట్ ఊసులేని రాజకీయం
ఆరంభశూరత్వంతో సరిపెట్టుకున్న తెలంగాణ నేత
హైదరాబాద్,నవంబర్2(జనంసాక్షి): ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్న దశలో ప్రమాదాన్ని గ్రహించిన తెలంగాణ సిఎం కెసిఆర్ ఫోర్త్ ఫ్రంట్ అంటూ గర్జించారు. దేశమంతా కాంగ్రెస్సేతర, భాజపాయేతర పార్టీలకు ప్రత్నామ్నాయం కోసం ఎదురు చూస్తోందని,ప్రజలు ప్రబలమైన రాజకీయ మార్పు కోరుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. వెంటనే తమిళనాడు, ఒడిశా, బెంగాల్ కర్నాటక రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి నేతలను కలిశారు. కెసిఆర్‌తో కలవడానికి వారంతా సై అన్నారు. కానీ పాలపొంగులా వచ్చిన ఆలోచన అంతలోనే ఆరిపోయింది.ఆయనకు అన్ని వైపుల నుంచి అనూహ్యంగా మద్దతు వచ్చినా ఉపయోగించుకోలేక పోయారు. లోపాయకారిగా మోడీతో మిలాఖత్ అయ్యారన్న ప్రచారం ఆయనపై పడింది. కనుక కెసిఆర్ ముందుకు సాగితే వెనక నడవడానికి సిద్దంగా ఉన్న ప్రజలు కూడా వెనక్కి తగ్గారు. ఇప్పుడు చంద్రబాబు ముందుకు..కెసిఆర్ వెనక్కి తగ్గారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుపై ఉన్న నమ్మకం కెసిఆర్‌పై లేకుండా పోయింది. నిజానికి ప్రజల దీవెనలతో దేశానికి మార్గనిర్దేశనం చేస్తాననగానే అనేక పార్టీలు బేషరతుగా మద్దతు పలికాయి. తెలంగాణ సాధించినట్లుగానే ఈ లక్ష్య సాధనలో వందశాతం విజయం సాధిస్తానని కెసిఆర్ నమ్మబలికారు. లక్షల మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుందని, తెలంగాణలో మొదలైన ప్రస్థానం దేశాన్ని చుట్టుముడుతుందన్నారు. కాంగ్రెస్, భాజపాల పాలనతో దేశానికి
ఒరిగిందేవిూ లేదన్నారు. త్వరలోనే ఏకాభిప్రాయం ఉన్న నేతలతో మాట్లాడతానని, ఆర్థిక నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతులతో చర్చించి ఎజెండా రూపొందిస్తానని చెప్పారు. గతంలో తెలంగాణ అజెండగా ఆయన అనేక పార్టీల నేతలను కలుపుకుని వారి మద్దతు పొందిన తరహాలో ముందుకు సాగుతారని అంతా అనుకున్నారు. ఎంపిగా, కేంద్రమంత్రిగా ఆయన అనేక సంఘటనలను ప్రత్యక్షంగా చూశారు. అందుకే గతానుభవం, వాక్చాతుర్యం, భాషపట్ల నైపుణ్యలు కెసిఆర్‌కు అదనపు బలంగా కలసివచ్చే అంశాలు.కెసిర్ ఇంగ్లీష్, హిందీ, ఉర్దూలో అనర్గళంగా మాట్లాడగలరు. అన్నింటికి మించి సమస్యను తెలుసుకోవడానికి లోతైన అధ్యయనం చేయడం ఆయనకు మాత్రమే సోంతం. ఇవన్నీ కలసివచ్చే అంశాలుగా చూడాలి. చంద్రబాబుకు భాష పెద్ద మైనస్. అయితే పట్టుదల ఆయనను ముందుకు నడిపిస్తుంది. అలుపెరగకుండా కష్టపడేతత్వం బాబుది. ఏదైనా మొదలు పెడితే పట్టువదలకుండా సాగుతారు. కథలు, ఉపన్యాసాలు చెబితే సరిపోదు. జపాన్, చైనా, సింగపూర్ ఎలా పైకొచ్చాయో ఈ దేశం కూడా అలా పైకి రావాలని కెసిఆర్ అన్నప్పుడు అంతా ఓ¬ అనుకున్నారు. ధైర్యం, చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వందశాతం వచ్చి తీరుతుందన్నారు. రైతాంగానికి ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి, పారిశ్రామిక వేత్తలకు రాయితీలు దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు. రైతుల గురించి ఆలోచించే పరిస్థితి రావాలి. అనేక వర్గాల విషయంలో ఆలోచనా ధోరణి మారాలి. ఇలా సిఎం కెసిఆర్ చెబుతున్న విషయాలు ప్రజలు నిజంగానే నమ్మారు. దేశంలో మార్పు రావాలంటే అది ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. అది తెలంగాణ నుంచే ప్రారంభమయిందనుకున్నారు. తెలంగాణలో ప్రారంభమైన ప్రస్థానం యావద్దేశాన్ని చుట్టుముట్టే సునావిూ కావాలనుకున్నారు. అది కెసిఆర్ అయితే అంతకన్న ఆనందం మరోటి ఉండదు. ఎందుకంటే పట్టిన పట్టు వీడకుండా గట్టిగా పోరాడే దమ్మున్న నాయకుడు కెసిఆర్ అని తెలంగాణ ప్రజలు విశ్వసించారు.. భయాలకు లొంగకుండా ముందుకు సాగే లక్షణం అయనకున్నదని తెలంగాణ ఉద్యమంలో చూశారు. ప్రజలు ఆశీర్వదిస్తే కేసీఆర్ వందశాతం విజయం సాధిస్తాడన్న నమమకం ఏర్పడింది. నన్ను పెంచి పోషించి ఈ స్థాయికి తెచ్చిన తెలంగాణ ప్రజల దీవెనలుంటే దేశానికి కొత్త దిశ, దశ చూపిస్తానని కేసీఆర్ కూడా నమ్మబలికారు. . చట్టాలను మార్చుకోవాలి. వాటితో కూడా కాదనుకుంటే కొత్తగా రాజ్యంగాన్ని రాసుకోవాలి. కులానికో చట్టం, మతానికో చట్టం, ప్రాంతానికో చట్టం వల్ల అసమానతలు పెరిగాయి. ప్రజల్లో ఏకభావం రావడం లేదు. ప్రజలంతా నాదేశం అని గర్వించేలా చేయాలి. అందుకు రాజకీయ పార్టీలు కూడా తమ పంథాను మార్చుకోవాలి. ప్రజల సంక్షేమం, దేశ హితం లక్ష్యంగా ముందుకు సాగాల్సి ఉందన్నారు. కానీ ముందస్తు ఎన్నికలతో సంకుచిత రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఫ్రంట్ ప్రస్తావనకు పాతరేశారు. ఇప్పుడు కాంగ్రెస్,టిడిపి జతకట్టడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చంద్రబాబునే ఇతర పార్టీలు నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుకు సాగడం ఖచ్చితం కానుంది.