మే 15 కల్లా సర్వం సిద్ధం కావాలి
రెండు రాష్ట్రాల్లో పాలన సాగాలి
సచివాలయం సందర్శించిన గవర్నర్
హైదరాబాద్, ఏప్రిల్ 6 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజనకు సంబంధించిన అన్ని పంపకాలు మే 15 కల్లా పూర్తి చేయాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసిం హన్ అధికారులను ఆదేశించారు. ఆలోగా భవనాలను సిద్ధం చేయాలని అన్ని సౌకర్యాలు కల్పించాలని గవ ర్నర్ సూచించారు. ఆదివారం మధ్యాహ్నం సచివాలయానికి గవర్నర్ విచ్చేశారు. భవనాల పరిశీలన కోసమే ఆయన సచివాలయానికి వచ్చారు. ఆయన రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయ ప్రాంగణంలో సుమారు గంటకు పైగా గడిపారు. ‘డి’ బ్లాకులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, గవర్నర్ సలహాదారులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వాల కోసం సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రికి ‘సి’ బ్లాక్‌ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ‘హెచ్’ సౌత్ బ్లాక్‌ను కేటాయించారు. ప్రస్తుత ప్రవేశ ద్వారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రవేశించడానికి కేటాయించడంతో హెచ్ నార్త్ బ్లాక్ పక్క నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రవేశించేలా కొత్త మార్గం ఏర్పాటు చేయనున్నట్టు గవర్నర్‌కు అధికారులు తెలియజేశారు. అలాగే రెండు ప్రభుత్వాల బ్లాక్‌లకు మధ్య కంచె ఏర్పాటును కూడా గవర్నర్ పరిశీలించారు. మే 15వ తేదీ నాటికల్లా సిద్ధం చేయాలని గవర్నర్ సూచించారు. ఏ, బీ, సీ, డీ, నార్త్ హెచ్ బ్లాక్‌లను తెలంగాణా ప్రభుత్వానికి కేటాయించారు. హెచ్ సౌత్ బ్లాక్, జె, ఎల్, కె, బ్లాక్ లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించినట్టు అధికారులు వివరించారు. భవనాలు, వసతులు, భద్రత, రాకపోకలు తదితర వివరాలను గవర్నర్‌కు తెలియజేశారు