శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 15కిలోల బంగారం పట్టివేత

 

gold
– ఇద్దరు మహిళలు అరెస్టు
హైదరాబాద్, ఏప్రిల్ 9 (టీ మీడియా): శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు మహిళల నుంచి 15.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.4.54 కోట్లు. బుధవారం తెల్లవారుఝామున 3.30గంటలకు ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ఓ మహిళను ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు తనిఖీ చేశారు.
దుస్తుల్లో దాచిన కిలో బరువున్న 2 బంగారు కడ్డీలతోపాటు పదేసి తులాలున్న మరో 6 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ డ్యూటీని ఎగ్గొట్టేందుకే బంగారాన్ని దొంగతనంగా తీసుకెళ్తున్నానని మహిళ తెలిపారు. ఆ బంగారం కడ్డీల విలువ రూ.78 లక్షలు ఉంటుందని బషీర్‌బాగ్‌లోని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సయిజ్ కార్యాలయంలో కస్టమ్స్ చీఫ్ కమిషనర్ (హైదరాబాద్ జోన్) బీబీ ప్రసాద్ తెలిపారు. బుధవారం ఉదయం పది గంటలకు దుబాయ్ ఎమిరేట్స్ విమానంలో వచ్చిన మరో మహిళ నుంచి కిలో బరువున్న 13 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.76 కోట్లని తెలిపారు. ఈ మహిళ ఎమిరేట్ విమానయాన సంస్థ ఉద్యోగురాలు. 2013-14 లో స్మగ్లర్ల నుంచి రూ.17.96కోట్ల విలువ చేసే 60.268 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.