భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నేడు మోదీ ప్రమాణస్వీకారం
మహాత్ముడికి ప్రణమిల్లి..
సోమవారం ఉదయం ఏడు గంటలకు రాజ్‌ఘాట్‌కు చేరుకొని, మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ఆపద్ధర్మ ప్రధాని మన్మోహన్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ పాల్గొననున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతలు తరలివస్తున్నారు. మోదీ తల్లి హిరాబా కూడా రావచ్చునని సమాచారం. అఫ్ఘాన్, భూటాన్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక ఆధిపతులు హమీద్ కర్జాయ్, తేరింగ్ తొబ్గాయ్, సుశీల్ కొయిరాలా, అబ్దుల్ గయూమ్, రాజపక్సే పాల్గొంటుండగా, మరో సార్క్ దేశం బంగ్లాదేశ్.. స్పీకర్ షిరాన్ చౌధురీని ప్రతినిధిగా పంపనుంది. 770 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు; 350 మంది దేశ, విదేశీ మీడియా ప్రతినిధులు; మన్మోహన్, ఆయన మంత్రివర్గ సహచరులు; సీఎంలు, గవర్నర్లు పాల్గొననున్నారు.
ఆ నలుగురూ…
వడోదరలో తన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేసిన నలుగురికీ మోదీ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానం అందింది.
వాజ్‌పేయి వారసునిగా..
అనేక విషయాల్లో మోదీ.. వాజ్‌పేయి వారసుడిగా ముందుకొస్తున్నారు. వాజ్‌పేయి చొరవతో రూపుదిద్దుకున్న ఎన్డీయే కూటమిని మరోసారి ఆయన అధికారంలోకి తెచ్చారు. వాజ్‌పేయి పద్ధతుల్లోనే ఇరుగుపొరుగు దేశాలకు స్నేహహస్తం అందించారు. అలాగే, నాడు అటల్ బిహారీ తరహాలోనే అశేష జనావళి సమక్షంలో ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో నాలుగు గోడల మధ్య కొద్దిమంది వీవీఐపీల సమక్షంలో క్లుప్తంగా సాగే ప్రమాణ స్వీకారం సంప్రదాయానికి తొలుత గండి కొట్టింది మాత్రం జనతా పార్టీ నేత, మాజీ ప్రధాని చంద్రశేఖరే. అయితే, వీరిద్దరి కన్నా ఎక్కువ సంఖ్యలో జనం మోదీకి జయహో పలకనుండటం విశేషం. 1990లో చంద్రశేఖర్, 1998లో వాజ్‌పేయిల ప్రమాణానికి వెయ్యి మందికి మించి హాజరు కాలేదు. దీనికి భిన్నంగా మూడు వేలకు పైగా ఇప్పుడు తరలివస్తున్నారు.
మోదీ ప్రమాణ స్వీకారానికి 3000 మంది హాజరవుతున్నారు. కానీ.. ఆయన కుటుంబసభ్యులు మాత్రం టీవీల్లోనే చూడనున్నారు. “మాలో ఒక్కరం కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లట్లేదు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారాన్ని మేం టీవీల్లో చూడాలని నిర్ణయించుకున్నాం” అని ఆయన సోదరుడు ప్రహ్లాద్‌మోదీ స్పష్టం చేశారు.
కే 9 స్పెషల్ స్క్వాడ్!
సీబీఐ, రా, ఇంటెలిజెన్స్ వర్గాల హడావుడి సరే.. మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా రక్షణ విభాగంలోకి ఒక సరికొత్త దళం వచ్చి చేరింది. అదే.. శిక్షణ పొందిన శునక దళం. దేశంలోని రాజకీయ, వ్యాపార ప్రముఖులు, వివిధ దేశాల అధినేతలు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి హోం శాఖ కనీవినీ ఎరుగని భద్రత ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే.. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు చెందిన ‘నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ యానిమల్స్ (ఎన్టీసీడీఏ-భాను, చండీగఢ్) నుంచి అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన డజనుకు పైగా శునకాలను రంగంలోకి దింపింది. సునిశితమైన ఘ్రాణశక్తితో బాంబుల జాడను పసిగట్టి అప్రమత్తం చేసి, పెను ముప్పు నుంచి కాపాడే ఈ శునకాలను ‘కె9’ స్క్వాడ్‌గా వ్యవహరిస్తారు (కె9 అంటే.. కెనైన్ అని అర్థం). బాంబులు, పేలుడుపదార్థాల జాడ తెలియగానే చెవులు, తోకను నిక్కబొడుచుకుని.. ఉన్నపళంగా అక్కడే కూలబడతాయి. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమవుతారు.
భద్రతా వలయంలో ‘వేదిక’
ప్రమాణ స్వీకార వేదిక అయిన రాష్ట్రపతిభవన్‌ను ఎన్ఎస్‌జీ కమాండోలు స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. దాదాపు పది వేల మంది భద్రతా సిబ్బంది భవన్ పరిసరాలపై డేగ కన్ను వేశారు. గగనతలం నుంచి వైమానిక దళాలు అన్ని వైపులా కాపు కాస్తున్నాయి. కార్యక్రమం పూర్తయ్యేవరకు వైమానిక దళ విమానాలు దుర్భేద్యమైన రాష్ట్రపతిభవన్‌పై చక్కర్లు కొట్టనున్నాయి. రాష్ట్రపతిభవన్‌కు దారితీసే మార్గాలను పోలీసులు మూసివేశారు. ఎన్ఎస్‌జీ విభాగానికి చెందిన షార్ప్‌షూటర్ల బృందం, యుద్ధ విమాన విధ్వంసక దళాలతో పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులు సమన్వయం చేసుకుంటున్నారు. “ఢిల్లీ జిల్లా పరిధిలో సోమవారం నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయి. వైమానిక దళాల సిబ్బంది పూర్తిస్థాయిలో గగనతలాన్ని అదుపులోకి తీసుకుంటారు” అని ఢిల్లీ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎమ్‌కే మీనా మీడియాకు తెలిపారు. కాగా, వేసవిని దృష్టిలో ఉంచుకొని అతిథుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌కు దారితీసే మార్గాలన్నిటినీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా మూసివేయనున్నారు.