16న లర్నింగ్ లైసెన్స్ మేళా నిర్వహణ
కరీంనగర్, డిసెంబర్ 12 : లర్నింగ్ లైసెన్స్ కోసం ఈ నెల 16వ తేదీన తిమ్మాపూర్‌లోని ఉప రవాణ కమిషనర్ కార్యాలయ సముదాయంలో లర్నింగ్ లైసెన్స్‌ల మేళా నిర్వహిస్తున్నట్లు ఉపరవాణా కమిషనర్ యం.ప్రభురాజ్ కుమార్ తెలిపారు. ఈ మేళా ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్కడే స్లాట్ నమోదు చేసుకొని, ఫీజు చెల్లించి కంప్యూటర్‌లో ఎల్.ఎల్.ఆర్‌టెస్ట్ హాజరు కావచ్చని తెలిపారు. ప్రతి అభ్యర్థికి పరీక్ష 10నిముషాలు ఉంటుందని, 20 ప్రశ్నలకు 12 ప్రశ్నలు సరిగా గుర్తించి మార్క్ చేసిన వారు ఉత్తీర్ణులై లర్నింగ్ లైసెన్స్ పొందుతారని ఆయన తెలిపారు. ఈ మేళాలో పాల్గొని లర్నింగ్ లైసెన్స్ పొందుటకు 18సంవత్సరాల వయసు నిండిన వారై, వాహనం నడుపు యోగ్యత కలిగి ఉండాలన్నారు. అడ్రస్, పుట్టినతేదీ సంబంధించి ఒరిజినల్ ధృవీకరణ పత్రములతో పాటు జిరాక్స్ కాపీలను గెజిటెడ్ అధికారిచే ధృవీకరించి తీసుకురావాలన్నారు. రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను అతికించాలని, 50సంవత్సరాలు పై బడిన వారు మెడికల్ ఫిట్‌నెస్ సమర్పించాలన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.