18ఎఫ్‌ ఎత్తివేయాలి

3
ఎక్కడివారక్కడే పనిచేయాలి

ఆంధ్ర సర్కార్‌ కన్నుసన్నల్లో కమల్‌నాథన్‌ కమిటీ

కేంద్ర హోం శాఖను కలుస్తాం : దేవీప్రసాద్‌

హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) :

ఉద్యోగుల విభజన విషయంలో కమలనాథన్‌ కమిటీ చేసిన మార్గదర్శకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని టీఎన్‌జీవో కేంద్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అన్నారు. ఆదివారం నగరంలోని టీఎన్‌జీవో కేంద్ర కార్యాలయంలో ఆయన సంఘ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ కనుసన్నల్లోనే కమల్‌నాథన్‌ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్‌ మాట్లాడుతూ కమిటీ మార్గదర్శకాల్లోని 18ఎఫ్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఏపీ ఉద్యోగులు పనిచేసే విధంగా 18 ఎఫ్‌ ఉకందన్నారు. ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలోనే పనిచేయాలన్నారు. అలాంటప్పుడే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఒక ప్రాంతం ఉద్యోగులు మరో ప్రాంతంలో పనిచేస్తే భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉందన్నారు. దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖను కలుస్తామన్నారు. గృహ నిర్మాణ అవకతవకల్లో రాజకీయ నాయకులకు ప్రధాన పాత్ర ఉందని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.