అభయ కీచకులకు 20 ఏళ్ల కఠిన కారాగారం
ఏడు నెలల్లో దర్యాప్తు పూర్తి
నేరస్తులను గుర్తించేందుకు ఎన్‌ఐఏ సహాయం
హైదరాబాద్, మే 14 (జనంసాక్షి) :
హైదారబాద్ శివారులో ఏడు నెలల క్రితం జరిగిన అభయ అత్యాచారం కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులు డ్రైవర్ సతీష్, అతని స్నేహితుడు వెంకటేశ్వర్లపై 366, 342, 376 సెక్షన్ల కింద నేరం రుజువైందని న్యాయమూర్తి పేర్కొంటూ దోషులకు చెరో 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో మొత్తం 21 మంది సాక్షులను పోలీసులు విచారించారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఎన్‌ఐఏ సహాయం తీసుకున్నారు. న్యాయస్థానం ఏడు నెలల్లోనే కేసును పూర్తి చేసింది. గత ఏడాది అక్టోబర్ 18న నగర శివారులో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతిని బలవంతంగా తీసుకుని వెళ్లి గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు అభయ కేసు నమోదు చేసి, ఆధారాలతోపాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి నిందితులకు రెండు అవకాశాలు ఇచ్చారు. 376 డి కింద 20 ఏళ్లు లేదా జీవితకాలం జైలు శిక్ష విధించవచ్చునని, న్యాయమూర్తికి ఉన్న అధికారలతో 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు చెప్పారు. తీర్పు వినగానే నిందితులు ఇద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబసభ్యులు, నిందితుల సమక్షంలోనే న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. తీర్పు ఇచ్చే ముందు న్యాయమూర్తి నిందితులు, వారి కుటుంబసభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తప్పు చేశామని, శిక్ష తగ్గించాలని, కుటుంబ సభ్యులను పోషించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని నిందితులు అన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి నేరం రుజువైంది కాబట్టి, కుటుంబం పరిస్థితుల దృష్ట్యా జీవితకాలం వేయాల్సి శిక్షను 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నానని, అంతకు తక్కువ శిక్ష విధించే అవకాశం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రంగారెడ్డి జిల్లా కోర్టు నిర్భయ చట్టంకింద తొలికేసు విచారణ పూర్తి చేసింది. గత ఏడాది అక్టోబరు 18న మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన కేసును అభయ కేసుగా పోలీసులు పేర్కొన్నారు. తామేం తప్పు చేయలేదని నిందితులు జడ్జికి చెప్పారు. కోర్టు కాసేపు వాయిదా పడి తిరిగి ప్రారంభం కాగానే న్యాయమూర్తి తీర్పు ప్రకటించారు. ఈ కేసులో దోషులుగా తేలిన నెమ్మడి వెంకటేశ్వర్లు, వెడిచెర్ల సతీష్లకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. బాధితురాలి పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగరాజు, నిందితుల తరపున ఇద్దరు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అరెస్టయినప్పటి నుంచి నేటి వరకు కూడా నిందితులు చర్లపల్లి జైలులోనే ఉన్నారు. ఇక కేసు వివరాల్లోకి వెళితే బెంగళూరుకు చెందిన అభయ గౌలిదొడ్డిలోని మహిళా హాస్టల్‌లో ఉంటూ హైటెక్‌సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. అక్టోబర్ 18న సాయంత్రం 5.30కి విధులు ముగించుకున్న ఆమె ఇనార్బిట్ షాపింగ్‌మాల్‌కు వెళ్లింది. రాత్రి 7.30కి షాపింగ్ మాల్ నుంచి బయటికి వచ్చి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఆమె ఎదుట కారు (ఏపీ09టీవీఏ2762) ఆగింది. డ్రైవర్ సీట్లో వరంగల్ జిల్లాకు చెందిన వెడిచెర్ల సతీష్ (30), పక్క సీట్లో నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన అతని స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లు (28) ఉన్నారు. హాస్టల్ వద్ద డ్రాప్ చేస్తామని అభయను నమ్మించి కిడ్నాప్ చేశారు. లింగంపల్లి వైపు కారును పోనిచ్చారు. తన కారు దారితప్పిందన్న విషయాన్ని గుర్తించిన బాధితురాలు బెంగులూరులో ఉన్న తన స్నేహితుడికి సమాచారం ఇవ్వగా అతను మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితులు బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ దాటాక టేకు చెట్ల పొదల్లోకి కారును తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అక్కడ ఓ స్కూల్ సిసి కెమరాల ఆధారంగా పోలీసులు కారు నంబరనును గుర్తించి నిందితులను పట్టుకున్నారు. బాధితురాలు కేసు పెట్టేందుకు మొదట సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో అదనపు డీసీపీ జానకీ షర్మిల కౌన్సెలింగ్ చేయడంతో బాధితురాలు ధైర్యంగా కేసు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీంతో వివరాలను రాబట్టిన పోలీసులు కేసును ఛేదించారు.