200 యూనిట్ల ఉచిత విద్యుత్ కై దశలవారిగా ఉద్యమం

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):రాష్ట్రంలో ధనికుల వ్యవసాయ మోటార్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్న విధంగానే నిరుపేదలైన దళితుల ఇండ్లకు 200 యుానిట్ల విద్యుత్ ను ఉచితంగా ఇవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఆ సంఘ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రాష్ట్రంలో ధనవంతుల మోటార్లకు ఉచితంగా విద్యుత్ ఇస్తూ దళితుల ఇండ్ల విద్యుత్ బిల్లులను బలవంతంగా వసూలు చేస్తున్నారని,అక్రమంగా  విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 342 జీవో ప్రకారం 101 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పినప్పటికీ ఎక్కడా నిధులు విడుదల చేయడం లేదన్నారు.200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దశలవారీ ఉద్యమం నిర్వహించనున్నట్లు తెలిపారు.మొదటగా జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం,రెండవ దఫా మండల కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరపడం,దళిత వాడలలో సంతకాల సేకరణ చేయడం,మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఏఈ,డిఈ,ఎస్ఈ లకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో కెవిపిఎస్  జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు , జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు,జిల్లా సహాయ కార్యదర్శులు దేవరకొండ యాదగిరి, పిండిగ నాగమణి తదితరులు పాల్గొన్నారు.