తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 200 మెడికల్‌ సీట్లు

4

ఉస్మానియా ఆధునీకరణకు 200 కోట్లు

ప్రాథమిక కేంద్రాల నుంచే కార్పొరేట్‌ వైద్యం : డెప్యూటీ సీఎం రాజయ్య

హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 200 మెడికల్‌ సీట్లు కేంద్రం మంజూరయ్యాయని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ టి.రాజయ్య తెలిపారు. వీటిలో నిజామాబాద్‌ రిమ్స్‌కు 100 సీట్లు, గాంధీ మెడికల్‌ కాలేజీకి 50 సీట్లు, కాకతీయ మెడికల్‌ కాలేజీకి 50 సీట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఎంసీఐ నుంచి సమాచరం అందిందని అన్నారు. ఇదిలావుంటే ఉస్మానియా వైద్య కళాశాలకు మరమ్మతుల కోసం రూ. 200 కోట్లు కేటాయిస్తున్నట్టు రాజయ్య ప్రకటించారు. ఎంబీబీఎస్‌ కోర్సు ఫీజులు పెంచబోమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో వైద్యులు, నర్సుల ఖాళీల వివరాలు సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతామన్నారు. కార్పొరేట్‌ వైద్యాన్ని ప్రాథమిక కేంద్రాల నుంచే అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఉస్మానియా ఆస్పత్రి మరమ్మతులకు రూ. 200 కోట్లు మంజూరయ్యాయని వీటితో ఆధునీకరణ చేపడతామని అన్నారు. త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి మరమ్మతు పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. గ్రామస్థాయి ఆస్పత్రులను అభివృద్ది చేయడమే లక్ష్యమన్నారు.  కరీంనగర్‌ లేదా ఖమ్మంలో వైద్య కళాశాల ఏర్పాటుకు సింగరేణి సుముఖంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. దీనికి సింగరేణి కూడా 200 కోట్లు ఇవ్వడానికి సుముఖంగా ఉందన్నారు. వైద్య కళాశాల నెలకొల్పడంపై సీఎంతో చర్చిస్తామని చెప్పారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పేరు మార్పుపై సీఎంతో చర్చిస్తామని ఆయన చెప్పారు. కరీంనగర్‌ లేదా ఖమ్మంలో సింగరేణి ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఏపీ వైద్యులు సొంత ప్రాంతానికి వెళ్లిపోతే తెలంగాణ వైద్యులకు ప్రమోషన్లు ఉంటాయని మంత్రి రాజయ్య పేర్కొన్నారు.