టాప్‌ 200 వర్శిటీల్లో భారత్‌కు చోటులేదు

1

ప్రథమ స్థానంలో మస్సాచుస్సెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ

లండన్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) :

ప్రపంచ టాప్‌ 200 యూనివర్సిటీల్లో భారత్‌లోని ఏ ఒక్క విశ్వవిద్యాలయానికి చోటు దక్కలేదు. ప్రథమ స్థానంలో మస్సాచుస్సెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నిలిచింది. మంగళవారం  ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకులు విడుదల చేశారు. క్వాస్‌క్వారెల్లీ సైమండ్స్‌(క్యూఎస్‌) ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకుల ప్రకారం భారత్‌ నుంచి ఐఐటీ బాంబే 222వ స్థానంలో, ఐఐటీ ఢిల్లీ 235వ, ఐఐటీ కాన్సూర్‌ 300వ, ఐఐటీ మద్రాస్‌ 322వ, ఐఐటీ ఖరగ్‌పూర్‌ 324వ స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 700 వర్సిటీలకు ర్యాంకులు ప్రకటించగా అందులో భారత్‌కు చెందిన 12 వర్సిటీలున్నాయి. గతంలో ఇవి 11 ఉండగా ప్రస్తుతం ఒకటి పెరిగి 12కు చేరాయి. పై ఐదు వర్సిటీలు కాకుండా మిగతా విశ్వవిద్యాలయాలు 400 ర్యాంకు కంటే తక్కువ స్థానంలో ఉన్నాయి. అవి ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఐఐటీ-రూర్కీ, ఐఐటీ-గౌహతీ, ముంబయి వర్సిటీ, కోల్‌కతా వర్సిటీ, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, పూణే వర్సిటీలున్నాయి.

మొదటి రెండువందల స్థానాల్లో 31 దేశాలకు చెందిన వర్సిటీలుండగా అందులో 51 విశ్వవిద్యాలయాలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో యూకే(29), జర్మనీ (13), నెదర్లాండ్స్‌ (11), కెనడా (10), జపాన్‌ (10), ఆస్ట్రేలియా (8)లు ఉన్నాయి. క్యూఎస్‌ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకుల ప్రకారం..

ఎంఐటీ తరువాతి స్థానంలో కేంబ్రిడ్జి, ఇంపీరియల్‌ విశ్వవిద్యాలయాలు ఉండగా రెండో స్థానం నుంచి హార్వర్డ్‌ వర్సిటీ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆ తరువాత ఆక్స్‌ఫర్డ్‌, లండన్‌ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాయి. టాప్‌ టెన్‌లోని మిగతా స్థానాల్లో వరుసగా స్టాన్‌ఫోర్డ్‌, కాల్టెక్‌, ప్రిన్‌న్సీటన్‌, యేల్‌ వర్సిటీలు ఉన్నాయి. పరిశోధనకు నాయకత్వం వహించిన క్యూఎస్‌ ఆచార్యుడు బెన్‌ సావ్‌టర్‌ మాట్లాడుతూ మొదటి స్థానంలో నిలిచిన 10 వర్సిటీల్లో మంచి బోధనా ప్రమాణాలు ఉన్నాయన్నారు. పరిశోధన, బోధన, ఉద్యోగ కల్పన, అంతర్జాతీయత లాంటి నాలుగు అంశాలలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వర్సిటీలకు క్యూఎస్‌ ప్రపంచ ర్యాంకులను ప్రకటించింది.