2005 లో అధికారులను దూషించిన కేసులో అసదుద్దీన్ అరెస్ట్
14 రోజుల రిమాండ్ పాతబస్తీలో ఉద్రిక్తత.. హైదరాబాద్ బంద్
సంగారెడ్డి/హైదరాబాద్, జనవరి 21 (జనంసాక్షి):
అధికారులను దూషించిన కేసులో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సంగారెడ్డి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు సంగారెడ్డి జైలుకు తరలించారు. కలెక్టర్‌ను, జేసీలను దూషించిన కేసులో ప్రధాన నిందితుడైన అసద్ సోమవారం ఉదయం సంగారెడ్డి కోర్టులో హాజరయ్యారు. న్యాయస్థానం ఆయనకు ఫిబ్రవరి 2 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను సంగారెడ్డి జైలుకు తరలించారు. ఇదే కేసులో అసద్ సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు.2005లో పటాన్‌చెరు ముత్తంగి రోడ్డు విస్తరణలో భాగంగా ప్రార్థనా స్థలాన్ని తొలగించేందుకు యత్నించిన అప్పటి మెదక్ జిల్లా కలెక్టర్ అశోక్‌కుమార్ సింఘాల్, జాయింట్ కలెక్టర్‌లను ఎంఐఎం నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అధికారుల విధులను అడ్డుకోవడం, దూషించారనే అభియోగాలపై అసదుద్దీన్, అక్బరుద్దీన్ సహా పలువురు ఎంఐఎం నేతలపై కేసులు నమోదయ్యాయి. ఒవైసీ సోదరులపై 163 (ఏ), 147, 149, 341 సెక్షన్ల కింద పటాన్‌చెరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఒకసారి సంగారెడ్డి కోర్టుకు హాజరైన అసద్, అక్బర్ అనంతరం మళ్లీ హాజరు కాలేదు. అయితే, కాంగ్రెస్‌తో ఎంఐఎం తెగదెంపులు చేసుకోవడం, సీఎం కిరణ్‌పై ఒవైసీ సోదరులు తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం వారిపై కేసులను తిరిగదొడింది. ఇప్పటికే, వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పటాన్‌చెరులో నమోదైన కేసులను తిరగదోడి, పీటీ వారెంట్‌పై అక్బర్‌ను సంగారెడ్డి కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో తిరిగి ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. ఇదే కేసులో ప్రధాన నిందితుడైన అసద్ సోమవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. రిమాండ్ విధించడంతో ఆయన్ను జైలుకు తరలించారు. జైలులో అసద్‌కు అడ్మిషన్ బ్లాక్ కేటాయించారు. జైలులో ఉన్న అసద్‌ను కలిసేందుకు ఎంఐఎం ఎమ్మెల్యేలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే, జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో వెనుదిరిగారు.ఇదిలా ఉంటే, అసద్ అరెస్టును నిరసిస్తూ ఎంఐఎం బంద్‌కు పిలుపునిచ్చింది. పార్టీ కార్యకర్తలు పాతబస్తీలో ఆందోళనకు దిగారు. దారుసలాం, మల్లేపల్లి సహా వివిధ ప్రాంతాల్లో దుకాణాలు మూసివేయించారు. కవరేజ్‌కు వెళ్లిన విూడియాపై వీరంగం సృష్టించారు. కెమెరాలను లాక్కొని ధ్వంసం చేశారు. నిలువరించేందుకు యత్నించిన పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దారుసలాం, మల్లెపల్లి, చార్మినార్, పత్తర్‌గట్టి తదితర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు, పాతబస్తీలో భారీగా బలగాలను మోహరించారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు. అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. ఆందోళన చేస్తున్న ఎంఐఎం కార్యకర్తలను లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.