2014లో థర్డ్‌ఫ్రంట్‌దే అధికారం : బర్దన్‌

హైదరాబాద్‌, మే 16 (జనంసాక్షి) :
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో థర్డ్‌ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీపీఐ జాతీయ నాయకుడు ఏబీ బర్దన్‌ పేర్కోన్నారు. గురువారం రాత్రి బర్దన్‌ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఆయన నివాసంలో కలుసుకున్నారు. జాతీయ రాజకీయాలు, వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుపై నేతలిద్దరూ చర్చించారు. కేంద్రం వద్ద తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని టీడీపీ అధినేత నాయుడు బుధవారం గుంటూరులో ప్రకటించారు. సమావేశానంతరం బర్దన్‌ విలేరులతో మాట్లాడుతూ ప్రజల కోసం 208 రోజుల పాటు పాదయాత్ర చెసిన నాయుడును తాను అభినందించినట్లు తెలిపారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున వచ్చే ఎన్నికల్లో సీపీఐ-టీడీపీ పొత్తు సంభావ్యత అంశం తమ చర్చలో చోటు చేసుకోలేదని ఆయన చెప్పారు. అయితే ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పడే అవకాశం ఉందని బర్దన్‌ తెలిపారు. లోక్‌సభకు ముందస్తూ ఎన్నికలను ఆయన తోసిపుచ్చారు.