2019కల్లా లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాం

– రెండేళ్లుగా 36వేల ఉద్యోగాలు కల్పించాం
– చంద్రబాబు ఎక్కడుంటే అక్కడే ఐటీ
– విశాఖలో ఐటీ కంపెనీలే లేవని జగన్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది
–  అసెంబ్లీకి రాకుండా ఐటీ గురించి మాట్లాడితే ఎలా
– ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌
– గన్నవరంలో మేధా టవర్స్‌లో ఐటీ కంపెనీని ప్రారంభించిన మంత్రి
విశాఖపట్టణం, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : 2019 కల్లా రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. విజయవాడ శివారులోని గన్నవరం మేధా టవర్స్‌ లో హెచ్‌సీఎల్‌, స్టేట్‌ స్టీట్ర్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీని మంత్రి గురువారం ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో 36 వేల ఐటీ ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించామన్నారు. చంద్రబాబు గతంలో సీఎం గా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందిందని, అదేవిధంగా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఐటీ రంగం వేళ్ళూనుకుంటోందని మంత్రి లోకేష్‌ తెలిపారు. మేధా టవర్స్‌ పక్కన మరో భవనం ఐటి కంపెనీల కోసం నిర్మిస్తున్నట్లు వివరించారు. ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని తెలిపారు. కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. తద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్నారు. విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు లోకేశ్‌ తెలిపారు. విశాఖలో ఐటీ కంపెనీలు లేవని ప్రతిపక్ష నేత జగన్‌ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఐటీ అభివృద్ధిపై అసెంబ్లీలో ప్రకటించామని, జగన్‌ అసెంబ్లీకి రాకుండా ఐటీ గురించి మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు.

తాజావార్తలు