అన్నారం బ్యాక్ వాటర్ ముంపు భూములను తీసుకొని రైతులకు మెరుగైన నష్టపరిహారం అందించాలి – కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు

జనంసాక్షి, మంథని : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తమ మంథని నియోజకవర్గంలోని కనీసం ఒక్క ఎకరాకు సాగునీరు అందకపోగా బ్యాక్ వాటర్ తో వందలాది ఎకరాల పంట భూములు గత ఐదేళ్లుగా నీట మునిగి సాగుకు నోచుకోక రైతులు రోడ్డున పడ్డారని, అన్నారం బ్యాక్ వాటర్ ముంపు భూములను తీసుకొని రైతులకు మెరుగైన నష్టపరిహారం అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ను మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కోరారు. మంథని మండలం వెంకటాపూర్, మల్లారం, కాన్సాయిపేట, ఆరెంద, అమ్మవారి పల్లె గ్రామాల్లో సుమారు 500 ఎకరాలు అన్నారం బ్యాక్ వాటర్ తో ముంపులోనే నిత్యం ఉండిపోతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం అన్నారం బ్యాక్ వాటర్ ముంపు రైతులు మంథని ఎమ్మెల్యే దుద్దుల శ్రీధర్ బాబును క్యాంపు కార్యాలయంలో కలసి తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తో పాటు మంథని ఆర్డిఓ తో ఫోన్లో మాట్లాడారు. రైతులకు గత నాలుగు సంవత్సరాలుగా రావాల్సిన క్రాఫ్ హాలిడే డబ్బులను వెంటనే విడుదల చేయడంతో పాటు ముంపు భూములను తీసుకొని మార్కెట్ రేటు ప్రకారం మెరుగైన నష్టపరిహారం అందించాలని ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.