కమిషన్లు తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టవా..?

– పిఆర్ ఏఈ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రావు
– వాడి వేడిగా సాగిన మండల సర్వసభ్య సమావేశం జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడి వేడిగా సాగింది. కమాన్పూర్ ప్రభుత్వ హాస్టల్ దారి వైపు సిసి డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయని, నిర్మాణంతో ఆ రోడ్డు పై కనీసం ట్రాక్టర్ వెళ్లే దారి కూడా లేకుండా అయిందని.. అధికారులకు కమిషన్లు తప్ప ప్రజాప్రయోజనాలు పట్టవా. .? అని పంచాయతీ రాజ్ రాధాను సింగిల్ విండో చైర్మన్ ఇను గంటి భాస్కరరావు ప్రశ్నించారు. అంతేకాక నిర్మాణ పనులు అంత నాసిరకంగా చేపట్టారని ఆయన ఆరోపించారు. పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడం పట్ల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై కలెక్టర్ ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. మరి కొంతమంది మండల అధికారులు సమావేశానికి రాకుండా క్రింది స్థాయి సిబ్బందిని పంపడం పట్ల సర్పంచులు, ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖ పంచాయతీరాజ్ ,వ్యవసాయ శాఖ, ఆర్టీసీ, విద్యుత్ శాఖ, రెవెన్యూ తో పాటు పలు శాఖలపై చర్చ జరిగింది. గత సమావేశంలో వచ్చిన సమస్యలు పరిష్కారం కాకుండా మళ్ళీ సమావేశం నిర్వహించడం.. తూతూ మంత్రం జరగడం ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ రాచకొండ లక్ష్మి రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇన్చార్జ్ ఎంపీడీవో, ఎంపీ ఓ శేషయ్య సూరి, వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీలు కోలేటి చంద్రశేఖర్, బోనాల వెంకటస్వామి, గోడిసెల ఉమా, శవ్వ శంకర్, సర్పంచులు నీలం సరిత, బొల్లపల్లి శంకర్ గౌడ్, ఆకుల ఓదెలు, అధికారులు వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్, వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్, ట్రాన్స్ కో ఎ ఈ రాజేంద్రకుమార్, పి ఆర్ ఏ ఈ రాధా, ఐకెపి ఎపిఎం శైలజ శాంతి, ఈజీఎస్ ఏపిఎం, సీనియర్ అసిస్టెంట్ వంశీ అధికారులు పాల్గొన్నారు.