సింగరేణి కార్మికులు తెలంగాణ కోసం గర్జించారు. మడిమ తిప్పని పోరు చేశారు.సెప్టెంబర్ 13, 2011 దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థలో రాజకీయ డిమాండ్ అయిన ప్రత్యేక రాష్ట్రం కోసం సమ్మె ప్రారంభమైన రోజు. అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తదితరుల మార్గదర్శనంలో సకల జనుల సమ్మెకు తెలంగాణ జేఏసీ పిలుపునిస్తే ఆర్టీసీ వాళ్లకన్నా
ముందు సింగరేణి కార్మికులే సమ్మె ప్రారంభించారు. ఈ సమ్మె 35 రోజుల పాటు కొనసాగింది. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో సింగరేణి కార్మికులు మొదటి వరుసలో నిలబడ్డారు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. తెలంగాణ ఉద్యమం ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష భగ్నం అరెస్టు అనంతరం జరిగిన శ్రీకాంతాచారి ఆత్మహత్యతో ఉద్యమం వేడెక్కింది. శ్రీకాంతచారి ఆత్మహత్యకు తల్లడిల్లిపోయిన నల్ల నేలలో బొగ్గు గని కార్మికులు స్వచ్చందంగా ఒక రోజు సమ్మెకు దిగారు. హైదరాబాద్ యూటీ ప్రతిపాదనను వ్యతిరేకస్తూ హైదరాబాద్ కోసం కూడా వారు సమ్మెకు దిగారు. శ్రీకృష్ణ కమిటికి వ్యతిరేకంగా రెండు రోజులు సమ్మె చేశారు. ఇలా సకల జనుల సమ్మెకంటే ముందు సింగరేణి కార్మికులు స్వచ్చందంగా ఏడుసార్లు సమ్మెకు దిగిన దాఖలాలున్నాయి. సకల జనుల సమ్మె కు మార్గ దర్శకులు సింగరేణి కార్మికులే!సకల జనుల సమ్మె జరుగుతున్న సందర్భంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ను సింగరేణి జేఏసీ నాయకులను అప్పటి తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రస్తుత టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ను సైతం పిలిపించి సమ్మెను
విరమించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తం దక్షణ భారతదేశంలో సమ్మె ప్రభావం తీవ్రంగా పడిందని పరిశ్రమలు మూత పడుతున్నాయని, విధ్యుత్ కు ఇబ్బందులు అవుతున్నాయని, ఢిల్లీ, నోయిడా వరకు సమ్మె సెగలు పడ్డాయని పేర్కొనడం జరిగింది. అంటే బొగ్గు గని కార్మికుల సమ్మె ప్రభావం ఏ విధంగా పడిందో ఇక్కడ స్పష్టమైపోతుంది. అప్పటి ఉద్యమ నేత, కేసీఆర్ తెలంగాణ కోసం నిరాహార దీక్షకు కూర్చున్నప్పుడు ఆయన అరెస్టును నిరసిస్తూ కూడా మొట్టమొదటిసారి సమ్మెకు దిగింది కూడా బొగ్గు గని కార్మికులే. అందుకే కేసీఆర్ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత సింగరేణి కార్మికులకు సకల జనుల సమ్మె జీతాన్ని ప్రకటించి, చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ఇంక్రిమెంట్ను కూడా బొగ్గు గని కార్మికులకు ఇవ్వడం జరిగింది. లాభాల వాటా బోనస్ ను 27 శాతం ఇచ్చారు.ఇప్పుడు 2012-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 35 శాతం పెంచి ఇవ్వండి అని ఆదేశించారు.అయితే ఈ ఉద్యమంలో సింగరేణి ప్రాంతంలో తీవ్ర నిర్బంధానికి గురైన, అరెస్టులకు గురైన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న వారెవ్వరికి కూడా పాలనలో భాగస్వామ్యం లేదనే అసంతృప్తి
మాత్రం బొగ్గు బావుల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. బొగ్గు గని కార్మికులకు ఐటీ మాఫీ చేయాలని, అసెంబ్లీలో తీర్మాణం చేసి సీఎం కేసీఆర్ కేంద్రానికి ఎలా పంపించారో అలాగే ఈ విదేశీ పెట్టుబడుల విషయంలోనూ అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపాలని
కార్మికులు ఈ సందర్భంగా కోరుతున్నారు. బొగ్గు గని కార్మికుల పిల్లల కోసం డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ను అమలు చేస్తున్నప్పటికి ఇన్వాలిడేషన్లో జరుగుతున్న అక్రమాలు కనీసం 80 శాతం కూడా మెడికల్ బోర్డుకు పెట్టుకున్న వారికి న్యాయం జరగకపోవడంతో కొంత అసంతృప్తి ఉంది.అలాగే రెండు సంవత్సరాల కనీస సర్వీస్ లేదని తీవ్ర అనారోగ్యంతో అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ఇవ్వకుండా కోర్టు వారికి కూడా న్యాయంగా ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చినప్పటికి దానిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న యాజమాన్యం విధానాలను సీఎం కేసీఆర్ పట్టించుకొని న్యాయం చేయాలని కార్మిక వర్గం కోరుతుం
ది. సకల జనుల సమ్మె సాక్షిగా తెలంగాణా ఏర్పాటు చేయడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన బొగ్గు గని కార్మికులంటే సీఎం కేసీఆర్ కు ప్రేమ ఉన్నప్పటికి చాలా విషయాలలో కార్మిక వర్గం వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఆయన దృష్టికి
వెళ్లడం లేదని కూడా కార్మికులు పేర్కొంటున్నారు. సకలజనుల సమ్మె సింగరేణి జేఏసీ నాయకత్వంలో జరిగింది. బిఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, టీఎన్టీయూసీ, ఐఎఎఫ్ టియూ, l,
ఎస్సీ, ఎస్టీ కార్మిక సంఘం, ఉద్యోగుల సంఘం ఇలా ఎన్నో కార్మిక సంఘాలు కలిసి వచ్చాయి. సింగరేణి జేఏసీకి చైర్మన్ గా నేను, కోఆర్డినేటర్ గా మాదాసు రామ్మూర్తి, ఆయా కార్మిక సంఘాల నాయకులు కెంగర్ల మల్లయ్య, రియాజ్ అహ్మద్, బి. సంపత్కుమార్ తదితరులు
కోచైర్మన్లుగా జేఏసీలో ఏరియా వారి జేఏసీ ఇంచార్జి లుగా, కన్వీనర్ లు గా హెచ్.రవీందర్, పాషా,ఏబూసి ఆగయ్య,గోసిక మల్లేష్ భాగస్వాములుగా ఉన్నారు. అప్పటి శాసనసభ్యులు నల్లాల ఓదెలు, జి. అరవిందరెడ్డిలు సింగరేణి కార్మికులకు పూర్తి మద్దతు తెలిపి సమ్మె సందర్భంగా జరిగిన పలు కార్యక్రమాలలో నేరుగా పాలుపంచుకున్నారు. వారి పాత్ర ప్రశంసనీయం. కాగా టీబీజీకేఎస్ అధ్యక్షునిగా అప్పుడు ఉన్నటువంటి కెంగర్ల మల్లయ్య ఈ సమ్మెలో కీలకమైన పాత్రను పోషించారు. టీబీజీకేఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ సమ్మెలో పాల్గొనడం కోసం ఆయనతో పాటు దాదాపు అన్ని ఏరియాల నాయకులు
కీలకంగానే పాల్గొనడమే కాకుండా ఇతర యూనియన్ల నాయకులు, కార్యకర్తలకన్నా ఎక్కువ కేసులు వారిపై నమోదు అయ్యాయి. జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాటంలో అన్ని కార్మిక సంఘాల నాయకులు అందరు పాలు పంచుకోవడం, పోరాటాలలో
అరెస్టులు కావడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య, ఎమ్మెల్సి దేశపతి శ్రీనివాస్, ప్రస్తుత ఫిషరీస్ బోర్డు చైర్మెన్ పిట్టల రవీందర్ తదితరులు పలుమార్లు కోల్ బెల్ట్ ప్రాంతాన్ని సందర్శించి సభలు, సమావేశాలలో పాలు పంచుకోవడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో అన్ని
కార్మిక సంఘాలను సమన్వయం చేస్తూ జేఏసీ బాధ్యునిగా నేను ముందుకు కదలడం జరిగింది.సింగరేణి జేఏసీ కో ఆర్డినేటర్ గా మాదాసు రామ్మూర్తి చాలా కీలకంగా వ్యవహరించారు. అయన కూడా పలు మార్లు అరెస్ట్ అయ్యాడు.,విద్యావంతుల వేదిక నాయకుడు గురిజాల రవీందర్రావు, హెచ్చెమ్మెఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్,ఐఎన్టీయూసీ అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పటికి టీబి జి కె ఎస్ అధ్యక్షులు బి. వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్,అప్పటి
ఏఐటీయూసీ అధ్యక్షుడు వై. గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యలతో పాటు బీఎంఎస్ నేతలు పులి రాజిరెడ్డి, రాజ నరేందర్,టీబిజికెఎస్ ఇప్పటి ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి,ఐఎఫ్ఎయూ నుంచి టి. శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ సంఘం నుంచి పులి మోహన్, తెలంగాణ ఉద్యోగుల సంఘం నుంచి శ్రీపతి రాజగోపాల్, కొత్తగూడెం జేఏసీ నుంచి డాక్టర్ శంకర్ నాయక్, మాధవ నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, ఆయా ప్రాంతాల నాయకులు చిప్ప నర్సయ్య, వెంకటస్వామి, కాంపెల్లి సమ్మయ్య, సిద్దంశెట్టి రాజమౌళి, ఖలీందర్ ఖాన్,
వీరభద్రయ్య, మల్లారెడ్డి, సురేందర్ రెడ్డి,లెక్కల విజయ్, ఎండి. అబ్బాస్, గని కార్మికుల సంఘం నుంచి చాంద్పాషా, జేఏసీ కన్వీనర్లు హనుమాండ్ల రవీందర్, గోషిక మల్లేష్, ఏబూసి ఆగయ్య, వంశీ, రిటైర్డ్ కార్మికుల సంఘం నేత లక్కర్సు ఆగయ్య, పలు యూనియన్ల నాయకులు పార్వతి రాజిరెడ్డి, జె. రవీందర్, సంపత్, ఒ. రాజశేఖర్, దివంగత బంటు సారయ్య, పొనగంటి భానుదాసు, సురేందర్ రెడ్డి, పెద్దపల్లి కోటిలింగం, సత్యనారాయణ, ప్రముఖ రచయితలు, కళాకారులు సుందిల్ల రాజన్న, అంతడుపుల నాగరాజు, దమ్మాల శ్రీనివాస్, ఎస్. ప్రభాకర్, స్వామి, జాకబ్, లక్ష్మినారాయణ, రాజయ్య, ఎస్. ప్రభాకర్ ఇలా ఎంతో మంది సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. సింగరేణి యాత్రలో ఇప్పటి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రజాయుద్ధనౌక గద్దర్, అప్పటి తెలంగాణ జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ మంత్రి బోడ జనార్ధన్, అప్పటి శాసనసభ్యులు నల్లాల ఓదెలు, జి. అరవిందరెడ్డి, సీపీఐ మాజీ శాసనసభపక్ష
నేత గుండా మల్లేష్, సోమారపు సత్యనారాయణ, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ జి. వివేకానంద్, మాజీ మంత్రి జి. వినోద్, ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ప్రముఖ జర్నలిస్టులు
పాశం యాదగిరి, కె. శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, రహమాన్, విరాహత్, క్రాంతిలతో పాటు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, పలు స్వచ్చంద సంస్థల నాయకులు ఇలా ఎందరో సింగరేణిలో జరిగిన తెలంగాణ
మహోద్యమంలో పాలు పంచుకున్నారు. వందల మందిపై పదుల సంఖ్యలో కేసులు కూడా నమోదు అయ్యాయి. కార్మికులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు, మహిళ సంఘాలు, విద్యార్థి
సంఘాలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. మహిళలు వంట వార్పు, ఇండ్లకు తాళాలు వేసి ఇంటి ముందు దీక్షలు లాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. సారా వ్యతిరేక, మద్యం వ్యతిరేక పోరాట స్ఫూర్తిదాతలైన సింగరేణి ప్రాంత మహిళలు
తెలంగాణ ఉద్యమంలో అరెస్టులకు కూడా గురైన దాఖలాలున్నాయి. తెలంగాణ ఏర్పడటానికి ముఖ్య కారకులైన బొగ్గుగని కార్మికులు ఢిల్లీకి సైతం వెళ్ళి జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించిన దాఖలాలున్నాయి. ఒక జర్నలిస్టుగా, బొగ్గుగని కార్మికునిగా, సింగరేణి జేఏసీ చైర్మన్గా నల్ల సూర్యుల పోరు లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని స్పష్టంగా చెప్పక తప్పదు. ఎన్నో వర్గాల అప్పటి సింగరేణి సీఎండీ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ సీఎంఓ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎస్. నర్సింగరావు ఐఎఎస్,లాంటి అధికారుల సంఘీభావంతో పాటుగా సింగరేణి అధికారుల సంఘం నాయకులు పరోక్ష, ప్రత్యక్ష మద్దతు కార్యాచరణ ఈ పోరాటానికి స్ఫూర్తిని ఇచ్చిందని
పేర్కొనవచ్చు. సింగరేణి కార్మికుల పోరాటం తెలంగాణ సాధనలో ఉద్యమం పెరగడానికి స్ఫూర్తినిచ్చిందని, చారిత్రాత్మకమని, అప్పటి మాజీ ఎంపీ, మాజీ మంత్రి,దివంగత సుష్మాస్వరాజ్ మాతో పేర్కొన్న విషయాలు ఎన్నటికి మర్చిపోలేనివి. పార్లమెంట్లో సుష్మాస్వరాజ్ లాంటి వారి
మద్దతు లభించకపోతే అలాగే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణను ఇవ్వద్దని గనక నిర్ణయించుకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదు. తెలంగాణ బిల్లు పాస్ అయ్యేదే కాదు. సోనియాగాంధీ సైతం అప్పట్లో బొగ్గుగని కార్మికులను కలిసి సంఘీ
భావం తెలిపిన దాఖలాలున్నాయి. ఏది ఏమైనా బొగ్గుగని కార్మికుల తెలంగాణ సాధన పోరాటం దశాబ్దాలుగా ఉన్న ఆకాంక్షతో నిజాయితీగా, చిత్తశుద్ధితో ఎంతో పట్టుదలతో కొనసాగింది. బొగ్గుగని కార్మికునికి, బొగ్గుకు మండే గుణం ఉంటుంది. కార్మికునికి సైతం అన్యాయానికి వ్యతిరేకంగా మండే గుణం ఉంది. ఇది అన్యాయం ఉన్నంత వరకు వారి జీవితాల్లో మార్పు వచ్చేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. అన్యాయానికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురుతూనే ఉంటుంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, విప్లవ పార్టీలు, జాతీయ, ప్రాంతీయ వృత్తి కార్మిక సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు అన్నింటి సంఘీభావం అందరి
భాగస్వామ్యం చేయూతతో సకలజనుల సమ్మె సింగరేణిలో విజయవంతమైంది. సమ్మె విరమణ సందర్భంగా అప్పటి సింగరేణి సీఎండీ, ప్రస్తుత సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగరావు సమ్మె వల్ల కార్మికులకు ఆర్థిక ఇబ్బంది కలగకూడదని, వెంటనే
కార్మిక సంఘాలతో, జేఏసీతో చర్చించి ఒక్కొక్క కార్మికునికి రూ.25 వేల అడ్వాన్స్ను కూడా ప్రకటించి వెంటనే చెల్లించడం కూడా చారిత్రాత్మకంగా పేర్కొనవచ్చు. ఉద్యమానికి ఒక ఐఏఎస్ అధికారి ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందించినట్లుగా
పేర్కొనవచ్చు. అడ్వాన్స్ వేతనాల నుంచి వాయిదాల రూపేణా రికవరీ చేసినప్పటికీ కార్మికులకు కొంత అడ్వాన్స్ చెల్లింపు, ఆర్థిక వెసలుబాటును ఆ సమయంలో కల్పించిందని పేర్కొనవచ్చు. మొత్తానికి చారిత్రాత్మకమైన సకలజనుల సమ్మెకు నల్లసూర్యులు
తెలంగాణ సాధన ఉద్యమంలో ఎప్పటికీ మార్గదర్శకులే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇదే సందర్భంగా తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన ఎందరో కార్మిక బిడ్డలకు, ఈ ప్రాంత యువకులను నల్లసూర్యులు స్మరించుకుంటూ ఉంటారు.