ఆచార సంప్రదాయాలు కొనసాగించాలే

ఎక్కడ ఉన్నా మున్నూరు కాపులు ఐక్యత చాటాలి
– జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
జనంసాక్షి, మంథని : మన పూర్వీకుల నుంచి వచ్చే ఆచార సంప్రదాయాలను కొనసాగించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. పొలాల అమావాస్య సందర్బంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్ల పొలాలమాస, బొడ్డెమ్మ పండుగ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత కులమైన మున్నూరు కాపులు ఎక్కడ ఉన్నా తమ ఐక్యత చాటాలన్నారు. మూన్నూరు కాపులంతా కలిసి హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులంతా కలిసి ఎడ్ల పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేయగా ఉద్యోగ రిత్యా హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డా తమ పూర్వీకుల ఆచార సంప్రదాయాలను మర్చిపోకుండా జీవన స్థితిగతులను నెమరువేసుకుంటూ పొలాల అమావాస్య పండుగను జరుపుకోవడం, సంప్రదాయబద్దంగా ఎడ్లను రంగురంగులతో అలంకరించి గ్రామీణ ప్రాంతాల్లో ఎలా పండుగను జరుపుకుంటారో అదే రీతిలో హైదరాబాద్‌లో జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి తనను ఆహ్వనించిన కులబాంధవులకు ఆయన ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.

తాజావార్తలు