తుమ్మల నాగేశ్వరరావు సంచలన నిర్ణయం.. బీఆర్ఎస్‌కు రాజీనామా..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలం నుంచి బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన నాటినుంచి తుమ్మల నాగేశ్వరరావు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. వాస్తవానికి తుమ్మల పాలేరు సీటును ఆశించారు. అయితే.. ఆస్థానంలో కందాళ ఉపేందర్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. దీంతో తుమ్మల అనుచరులతో వరుసగా సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు బుజ్జగించినప్పటికీ.. ఆయన టికెట్ ఇవ్వలేదంటూ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ క్రమంలో అనుచరులతో సమావేశమైన తుమ్మల నాగేశ్వరరావు వేరే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఈ తరుణంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలో చేరాలంటూ తుమ్మల నాగేశ్వరరావుకి ఆహ్వానం పంపింది. అంతేకాకుండా తుమ్మలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఖమ్మం నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా భేటీ అయి కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మలతో కూడా కీలక చర్చలు జరిపారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకుని.. కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపించారు.

అయితే, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇవ్వాల్టి నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. ఈ సమావేశానికి మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు అంతా హాజరవుతున్నారు. అంతేకాకుండా రేపు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు సోనియా, రాహుల్ తో చర్చల అనంతరం వారి సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశముంది.

దీనికోసం ఇప్పటికే ప్లాన్ పూర్తయినట్లు సమాచారం.. తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ పెద్దల నుంచి స్పష్టమైన హామీ లభించింది. దీంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని సమాచారం. కాగా.. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో బలమైన నేతగా ఉన్నారు. టీడీపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తుమ్మల నాగేశ్వరరావు.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలు ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు.

తుమ్మల నాగేశ్వరరావు 1985, 1994, 1999, 2009, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో బీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పాలేరు ఉప ఎన్నికలో గెలిచారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కందాళ ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం కందాళ బీఆర్ఎస్ లో చేరడంతో అధిష్టానం మళ్లీ ఆయనకే టికెట్ కేటాయించింది.

 

తాజావార్తలు