24వ అంతస్థు నుంచి దూకమన్నా.. దూకేస్తా!
న్యూఢిల్లీ : లంబూ.. ఈ పేరు టీమిండియాలో ఒకప్పుడు మార్మోగిపోయేది. కానీ ఇటీవల జరిగిన ప్రపంచకప్లో పేసర్ ఇషాంత్ శర్మ ఎక్కడా కనిపించలేదు. గాయాల కారణంగా అతడు ఈ జట్టులోకి ఎంపిక కాలేకపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే మోకాలి గాయం కారణంగా వెనుదిరిగాడు. అయితే.. తమ సారథి ఎంఎస్ ధోనీ మీద ఇషాంత్ శర్మ అపార నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేశాడు.
ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక కావడం దాదాపుగా ఖాయం అనుకున్న సమయంలో మోకాలి గాయం కావడంతో తాను తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యానని, ఆ సమయంలో మహీభాయ్ (ఎంఎస్ ధోనీ) తనకు ఇచ్చిన మద్దతు అంతా ఇంతా కాదని ఇషాంత్ తెలిపాడు. అలాంటి కెప్టెన్ తనను 24వ అంతస్థు నుంచి దూకేయమని చెప్పినా.. రెండో ఆలోచన లేకుండా దూకేస్తానని అన్నాడు. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ధోనీ చాలా సాయం చేశాడన్నాడు.
ఐపీఎల్ 8వ సీజన్లో తన సత్తా చూపించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్న ఇషాంత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఐపీఎల్ జట్లు అన్నింటిలోకి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పేస్ బౌలింగ్ ఎటాక్ బలంగా ఉందని లంబూ చెప్పాడు.