కాల్పుల విరమణ @ 24 గంటలు
జెరూసలేం/గాజా, జూలై 27 (జనంసాక్షి) :
వందలాది మంది సామాన్యులను బలితీసుకుంటోన్న ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల ఆధిపత్య పోరాటానికి కాస్త విరామం దొరికింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సేనలు, హమాస్ మిలిటెంట్లు అంగీకారం తెలిపారు. ఈమేరకు హమాస్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ దేశానికి చెందిన ముగ్గురు విద్యార్థులను హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ పాలస్తీనా శివారు పట్టణం గాజాపై వైమానిక, భూతల దాడులకు దిగింది. ఇజ్రాయెల్ సేనలపై హమాస్ మిలిటెంట్లు ప్రతిదాడులు చేయడంతో గాజా స్ట్రిప్‌లో క్షణమొక యుగంలో పరిస్థితి దుర్భరంగా మారింది. ఈక్రమంలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన బాంబు దాడుల్లో 600 మందికి పైగా సామాన్యులు బలైపోయారు. వీరిలో వందల సంఖ్యలో పసివాళ్లు ప్రాణాలు కోల్పోయారు. మహిళలు, వృద్ధులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాతపడ్డారు. హమాస్ మిలిటెంట్ల దాడిలో పదుల సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. హమాస్ మిలిటెంట్లను సాకుగా చూపుతో పాలస్తీనాలో కల్లోలం సృష్టించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించింది. దీనిపై మొదట మౌనం వహించిన అంతర్జాతీయ సమాజం, ప్రపంచ దేశాలు తర్వాత శాంతికోసం సంధి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఐక్యరాజ్య సమితి నేతృత్వంలోని వివిధ సంస్థలు ఇందుకు మధ్య వర్తిత్వం నెరిపాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు 24 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో సుమారు మూడు వారాల తర్వాత గాజా పట్టణంలో తుపాకుల మోత ఒక రోజు పాటు ఆగనుంది.