25న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి

హుస్నాబాద్‌లో నేర్పాట్లు సమీక్షించిన అధికారులు
భీమదేవరపల్లి, జగిత్యాల, జనంసాక్షి : ఈ నెల 25న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారికంగా సమాచారం అందడంతో జిల్లా మంత్రాంగం సీఎం పర్యటన ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లా అదనపు పాలనాధికారి అరుణ్‌కుమార్‌, అదనపు ఎస్పీ జనార్దన్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి సోమవారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరు, వంగరంలో హెలీప్యాడ్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన జరిపారు.ముల్కనూర్‌ డెయిరీ ముందు ఉన్న ప్రైవేటు స్థలం లేదా ఉన్నత పాఠశాల అవరణలో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేయనున్నారు. 132.11 కెవి సబ్‌స్టేషన్‌ ముందు ఉన్న స్థలంలో బహిరంగ సభ నిర్వహించేలా ప్రాథమికంగా నిర్ణయించారు. వంగర బాలికల పాఠశాల, మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ నిర్మాణం పనులు త్వరతగతిన పూర్తిచేయాలని సూచించారు. ముల్కనూర్‌ డెయిరీ వద్ద సబ్‌స్టేషన్‌ ప్రారంభించి అక్కడినుంచి నేరుగా వంగరకు చేరుకొని ఠాణా, గురుకుల పాఠశాలను ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారు. సీఎం తన పర్యటనలో ముల్కనూరు డెయిరీని సందర్శిస్తారు. ముల్కనూర్‌, సైదాపూర్‌లోని వాగులపై వంతెన నిర్మాణాలతోపాటు మూడు మండలాల్లో రూ.30కోట్లతో చేపట్టనున్న రక్షిత మంచినీటి పథకాలు, హుస్నాబాద్‌లోని రూ.6 కోట్లతో చేపట్టనున్న డిగ్రీ కళాశాలకు సీఎం చేతుల మీదుగా ఇక్కడే శంకుస్థాపనే చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట హుస్నాబాద్‌ మండలంలోనూ సీఎం పర్యటిస్తారని ప్రచారం సాగిన చివరికి భీమదేవరపల్లికే పర్యటన పరిమితమయింది. కార్యక్రమంలో ఆర్టీవో సంధ్యారాణి, హుజురాబాద్‌ డీఎస్పీ సత్య నారాయణరెడ్డి, ఐకేపీ అదనపు పీడీ రమేష్‌, తహసీల్దార్‌ కరీం, ఏవో శ్రీనివాస్‌రావు, మండల ప్రత్యేకాధికారి టీ. శ్రీనివాస్‌రావు ఉన్నారు.