28న ఖమ్మంలో ఉమ్మడి నేతల సభ

కూటమి అభ్యర్థులను గెలిపించాలి: భట్టి

ఖమ్మం,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 28న జరిగే బహిరంగ సభ వేదికను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క, తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. మహాకూటమి అగ్రనేతలు ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యంగా తొలిసారిగా రాహుల్‌ గాంధీ, చంద్రబాబు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ సభకు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యం ఉంటుందని నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదే వేదిక నుంచి దేశానికి మంచి సందేశం ఇవ్వనున్నామని, ప్రజాకూటమి నేతలందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు. లౌకికవాదాన్ని కాపాడు కోవడానికి భాజపాయేతర పార్టీలన్నీ కలిసి రావాలని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

పెత్తందారి పోకడలతో కేసీఆర్‌ కొనసాగించిన నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌, కేజీ టూ పీజీ విద్య, రెండుపడకల గదుల ఇళ్లు, మిషన్‌ భగీరథతో ఇంటింటికి నల్లా, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, తదితర హావిూలను అమలు చేయకుండా కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను వంచించారని విమర్శించారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే అన్నింటిని శరవేగంగా పూర్తి చేస్తామని హావిూ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలని భట్టి అన్నారు.అధికార పార్టీ నాయకులు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కవిూషన్లకు కక్కుర్తి పడి రిజర్వాయర్లను పురాకృతి పేరిట ఎక్కువ చేసి దోచుకున్నారని అన్నారు.