విలీనంపై 3న నిర్ణయం
అందరికీ న్యాయమే తెరాస కల
జైరామ్‌పై కేసీఆర్ ఫైర్
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు అన్నారు. అందరికీ న్యాయమే తమ అభిమతమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ టీడీపీ నేతలు ఆపార్టీ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు చివరి వరకు తెలంగాణకు అడ్డుపడ్డాడని అలాంటి పార్టీలో నేతలు ఎలా ఉంటారో నిర్ణయించుకోవాలన్నారు. చంద్రబాబు అడ్డుపడ్డ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసని వివరించారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయనేది అవాస్తవమని, అవన్నీ వట్టి పుకారని కొట్టి పడేశారు. దేశంలో తెలంగాణ రాష్ట్రానికి అగ్ర స్థానం దక్కాలని పిలుపునిచ్చారు. దేశంలో రెండు రాష్ట్రాలే జిల్లాల పునర్విభజన చేయలేదని, అవి పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు జిల్లాలను పెంచుకునే అవకాశం వచ్చిందని కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణలో ఇరవైనాలుగు,ఇరవైఐదు జిల్లాలు ఉండే విధంగా చేసుకోవాలని అన్నారు. విస్తీర్ణపరంగా పెద్దగా ఉన్న జిల్లాలను విబజన చేసుకోవాల్సి ఉందన్నారు. ఇందులో వికారాబాద్ ఒకటని అన్నారు. జిల్లాల విభజన వల్ల పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందని కెసిఆర్ అబిప్రాయపడ్డారు. లంబాడి తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని గిరిజనులు కోరుతున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మరుక్షణం వాటిని పంచాయతీలుగా చేస్తామని ఆయన చెప్పారు. దళితులకు ఇంకా న్యాయం జరగడం లేదని, వారికి కేటాయించిన డబ్బు వారికే ఖర్చు చేస్తామని అన్నారు. ఏడున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే అవకాశం ఉందని అన్నారు. దీనికి తోడు కేంద్రం నుంచి రెండున్నరవేల కోట్లు తెచ్చుకుంటే పదివేల కోట్లు ఖర్చు పెట్టవచ్చని అన్నారు. దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున ఇస్తామన్న వాగ్దాన్నాన్ని నిలుపుకుంటామని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పధకం ద్వారా లక్షల ఎకరాలకు నీరందించాలని ఆయన చెప్పారు. తెలంగాణ సాధించేవరకు ఉద్యమ బాట వీడబోనని గతంలో చెప్పానని, దీనికోసం దానికి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని కెసిఆర్ అన్నారు. ఇప్పుడు బంగారు తెలంగాణ రావాలి..ఇప్పుడు విూకు చెబుతున్నా.. తెలంగాణ తెచ్చుకున్నాం.. తెచ్చుకున్నంత మాత్రాన కాదు.. దీనిని సాకారం చేసుకోవాలి.. అనేక సమస్యలు ఉన్నాయి. గట్టిగా ఉండాలి.. పోరాడాలి.. న్యాయం కోసం పోరాడాలి. గట్టి, పటిష్టమైన నాయకత్వం ఉండాలి. అలా ఉంటే ఐదారేళ్లలో తెలంగాణను అబివృద్ది చేసుకోగలుతామని కెసిఆర్ అన్నారు. ఇంకా మనదగ్గర ఆంద్ర పార్టీలలో ఉండాలా అని ప్రశ్నిస్తున్నానని అన్నారు. కట్టకట్టుకుని అంతా వచ్చేయండని, గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న నేతలు పార్టీని వదలి రావాలని అన్నారు. చంద్రబాబు నాయుడు చిట్టచివరి వరకు తెలంగాణకు అడ్డం పడ్డారని ఆయన అన్నారు. రేపు చంద్రబాబు ఎటు దిక్కు మాట్లాడాతడని, అటు వైపే మాట్లాడుతారని, అందువల్ల తెలంగాణలో ఆంధ్రపార్టీలు అవసరం లేదు.. మనమే గౌరవంతో ఉందాం అని కెసిఆర్ అన్నారు. కేసీఆర్ ఈ సందర్భంగా కేంద్రమంత్రి జైరాం రమేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో సర్పంచి పదవికి ఎన్నిక కాలేని వ్యక్తి తెలంగాణను అవమానపరిచేలా మాట్లాడతారా అని కేసీఆర్ ప్రశ్నించారు. భద్రాచలంలోని 7 మండలాలు సీమాంధ్రలో కలుపుతారని ఢిల్లీనుంచి సమాచారం వుందని, అది దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణలో రెండేళ్లలో 15 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని, అదనపు విద్యుత్ ఉత్పత్తి అనేది అతిపెద్ద సవాలని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో భూముల ధరలు పడిపోతాయనేది వాస్తవం కాదన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రులను పెంచిపోషిస్తోందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెరాస పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావాలా వద్దా… అనేది మార్చి మూడున తేలిపోతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఏ నిర్ణయమైనా ఒక్కడినే తీసుకోనన్నారు. టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేసిన కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్‌పై ఈ సందర్భంగా కేసీఆర్ ఫైరయ్యారు. సర్పంచ్‌గా కూడా గెలవలేని వ్యక్తి ప్రజాక్షేత్రంలోని వ్యక్తులు, పార్టీలపై అనవసర ఆరోపణలు చేయవద్దని హితవు పలికారు.