30న ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌

1
హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) :

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ 30న విడుదల చేయాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సిలింగ్‌ పక్రియలో ముందడుగు పడింది. సోమవారం సమావేశమైన ఉన్నత విద్యా మండలి ఈనెల 30న ఇంజినీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదీని వెల్లడించాలని నిర్ణయించింది. ఆగస్టు 7 నుంచి ధ్రువీకరణపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ముగిసేలోపు తమ నిర్ణయాన్ని ఆంధప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాల ముందుంచుతారు. కౌన్సిలింగ్‌కు అవసరమైన చర్యలు పూర్తి చేయాలని కూడా ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అధికారులు లేకున్నా కోరం ఉన్నందున కౌన్సెలింగ్‌ తేదీలపై నిర్ణయాన్ని వెలువరించారు. ఈ సమావేశానికి తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ హాజరుకాలేదు. అయితే ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ తేదీల వెల్లడిపై ఎవరి ఒత్తిడి లేదని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ఆగస్టు 7 నుంచి జరిగేది ధ్రువపత్రాల పరిశీలన మాత్రమేనని ఆయన తెలిపారు. ఆగస్టు 4వ తేదీ నాటికి సుప్రీంకోర్టు కౌన్సెలింగ్‌ తేదీల వెల్లడిపై చెప్పాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 7 నుంచి జరిగేది ధ్రువపత్రాల పరిశీలన మాత్రమే అని తెలిపారు. కౌన్సెలింగ్‌ తేదీల వెల్లడిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదిస్తామని ఆయన చెప్పారు. అప్పట్లోగా యాజమాన్య కోటా సీట్ల భర్తీ, బోధనా రుసుంపై ఉత్తర్వులు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజన పదో షెడ్యూల్లో ఉన్నందున ఏపీలో కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఎంసెట్‌ అడ్మిషన్ల పక్రియ ఆలస్యం కావడంతో చాలామంది తెలుగు విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని వేణుగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా దృష్టిలో ఉంచుకుని ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ పక్రియ ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు. అడ్మిషన్లకు ఈనెల 30న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, ఆగస్టు 7 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు. ఆప్షన్ల ఎంపిక తర్వాత చేపడతామని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈలోగా అడ్మిషన్లకు సంబంధించి వివిధ అంశాలపై ఇరు రాష్ట్రాలు దృష్టిపెట్టాలని సూచించారు.